సీఏఏపై ముఖ్యమంత్రులకు విజయన్‌ లేఖ

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా తమతో చేతులు కలపాలని భాజపాయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ రాశారు...

Published : 04 Jan 2020 00:50 IST

తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా తమతో చేతులు కలపాలని భాజపాయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ రాశారు. ‘‘1955నాటి పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించడం వల్ల దేశంలోని కొన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. భారత రాజ్యాంగానికి మూల స్తంభాలైన ప్రాథమిక సిద్ధాంతాలను కాపాడేందుకు అన్ని వర్గాల ప్రజలు ఏకం కావాలి’’అని తన లేఖలో పేర్కొన్నారు. వీటి ప్రతులను మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్, బిహార్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులతో సహా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపారు. దీనిలో ఆయన తమ ప్రభుత్వం సీఏఏ, జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ), జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్‌పీఆర్‌)లను వ్యతిరేకించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.   

కేరళ శాసనసభ సీఏఏకి వ్యతిరేకంగా చేసిన తీర్మానం రాజ్యాంగ విరుద్ధం, రాష్ట్రాలు అటువంటి వాటిపై తీర్మానం చేసేముందు న్యాయసలహా తీసుకోవాలని అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన వ్యాఖ్యలపై పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ స్పందిస్తూ లేఖ రాశారు. ‘‘నేను అమాకుడినో, ప్రజలను తప్పుదారి పట్టించేవాడినో కాదు. నా ప్రజల గొంతు వినిపించడం నా కర్తవ్యం. కేంద్రం కూడా ఇదే విషయంపై శ్రద్ద వహించాలి. రాజ్యాంగ పరీక్షలో సీఏఏ ఓడిపోయిందన్న విషయం న్యాయశాఖ మంత్రిగా మీకు కూడా తెలుసు’’ అని రవిశంకర్‌ ప్రసాద్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని