ఆందోళనే.. ఆమె పుట్టినరోజు వేడుక

పుస్తకాలు పట్టుకుని పాఠశాలకు వెళ్లాల్సిన వయసులో ప్లకార్డులు పట్టుకుని పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతోంది ఆ బాలిక. ఆమే స్వీడన్‌కు చెందిన ప్రముఖ వాతావరణ ఉద్యమకర్త గ్రెటా థన్‌బర్గ్‌. శుక్రవారం ఆమె 17వ ఏటలోకి అడుగుపెట్టింది

Published : 04 Jan 2020 11:13 IST

స్టాక్‌హోం: పుస్తకాలు పట్టుకుని పాఠశాలకు వెళ్లాల్సిన వయసులో ప్లకార్డులు పట్టుకుని పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతోంది ఆ బాలిక. ఆమే స్వీడన్‌కు చెందిన ప్రముఖ వాతావరణ ఉద్యమకర్త గ్రెటా థన్‌బర్గ్‌. శుక్రవారం ఆమె 17వ ఏటలోకి అడుగుపెట్టింది. అయితే అందరిలా కేక్‌ కట్‌చేసుకుని సంబరాలు చేసుకోలేదు. పుట్టినరోజున కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ స్వీడన్‌ పార్లమెంట్‌ ముందు నిలబడి ఏడు గంటల పాటు ఆందోళన చేసింది. ‘పుట్టినరోజున వేడుకలు చేసుకునే అమ్మాయిని కాదు’ అని చెబుతున్న గ్రెటా నేటి తరానికి ఎంతో స్ఫూర్తినిస్తోంది. 

వాతావరణాన్ని కాపాడాలంటూ గత కొంతకాలంగా గ్రెటా ఉద్యమం చేస్తోన్న విషయం తెలిసిందే. ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ పేరుతో ప్రతి శుక్రవారం స్కూల్‌ మానేసి స్టాక్‌హోంలోని పార్లమెంట్‌ ముందు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపడుతూ వస్తోంది. ఎప్పటిలాగే జనవరి 3న(శుక్రవారం) కూడా తన నిరసన వినిపించింది. అది తన పుట్టినరోజు అయినప్పటికీ ఆందోళనే వేడుకగా భావించింది. చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పార్లమెంట్‌ ఎదుట నిరసన చేపట్టింది. 

15ఏళ్ల వయసులో ఉన్నప్పుడు గ్రెటా ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది. పర్యావరణ పరిరక్షణ కోసం రెండేళ్ల క్రితం స్వీడన్‌ పార్లమెంట్ ముందు ఒంటరిగా ధర్నాకు దిగింది. అలా ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగింది. గ్రెటాను స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని స్కూల్‌ విద్యార్థులు పర్యావరణం కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ వేదికలపై గ్రెటా తన గళం వినిపించింది. ఆమె ఉద్యమానికి మెచ్చి టైమ్స్‌ మ్యాగజైన్‌ 2019 సంవత్సరానికి గానూ గ్రెటాను టైమ్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా గుర్తించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని