‘మూర్ఖత్వానికి ప్రేమే విరుగుడు’

పాకిస్థాన్‌లోని సిక్కుల పవిత్ర స్థలం నన్‌కానా సాహెబ్‌ గురుద్వారాపై మూకదాడిని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తీవ్రంగా ఖండించారు....

Published : 04 Jan 2020 19:27 IST

గురుద్వారాపై దాడిని ఖండించిన రాహుల్‌గాంధీ

దిల్లీ: పాకిస్థాన్‌లోని సిక్కుల పవిత్ర స్థలం నన్‌కానా సాహెబ్‌ గురుద్వారాపై మూకదాడిని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తీవ్రంగా ఖండించారు. మూర్ఖత్వం చాలా ప్రమాదకరమైందని విమర్శించారు. ప్రేమ, పరస్పర గౌరవంతోనే దాన్ని జయించగలమన్నారు. 

ఈ ఘటనపై ట్విటర్‌ వేదికగా స్పందించిన రాహుల్‌.. ‘నన్‌కానా సాహెబ్‌పై దాడి జరగడం గర్హనీయం. దీన్ని మనమంతా ముక్తకంఠంతో ఖండించాలి. మూర్ఖత్వం చాలా ప్రమాదకరమైన విష పదార్థం లాంటిది. దానికి ఎలాంటి సరిహద్దులు ఉండవు. ప్రేమ, పరస్పర గౌరవం, అర్థం చేసుకునే మనస్తత్వమే దానికి విరుగుడు’ అని పేర్కొన్నారు. 

రాహుల్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనపై టీమిండియా క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ ట్విటర్‌లో విచారం వ్యక్తం చేశారు. దేవుడు అందరికీ ఒక్కడేనని, మనుషులమైన మనం పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అటు దాడిని నిరసిస్తూ దిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ, శిరోమణి అకాలీదళ్‌ నేతలు దిల్లీలోని పాక్‌ హైకమిషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. 

నన్‌కానా సాహెబ్‌ గురుద్వారాపై శుక్రవారం కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గురుద్వారాపై రాళ్లు విసురుతూ ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై మీడియాలో కథనాలు రావడంతో భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దాడిపై పాక్‌ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. అయితే పాక్‌ మాత్రం అలాంటి దాడి ఘటనేదీ జరగలేదని చెబుతుండటం గమనార్హం. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని