‘సీఏఏని వ్యతిరేకించే వారు ఇది చూడండి..’

పాకిస్థాన్‌లో మైనారిటీలు మతపరమైన పీడనకు గురౌతున్నారనడానికి పాక్‌లో గురుద్వారాపై తాజాగా జరిగిన దాడే ఉదాహరణ అని కేంద్రమంత్రి హర్దీ్ప్‌సింగ్‌ పూరి అన్నారు. మైనారిటీలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి.....

Published : 05 Jan 2020 01:33 IST

దిల్లీ: పాకిస్థాన్‌లో మైనారిటీలు మతపరమైన పీడనకు గురౌతున్నారనడానికి పాక్‌లో గురుద్వారాపై తాజాగా జరిగిన దాడే ఉదాహరణ అని కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి అన్నారు. మైనారిటీలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి కాబట్టే అక్కడి నుంచి శరణార్థులుగా వచ్చిన వారికి భారత్‌ పౌరసత్వం కల్పిస్తోందని, అందుకే పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. సీఏఏని వ్యతిరేకిస్తున్న వారంతా తమ వైఖరిపై పునరాలోచన చేయాలని సూచించారు.

‘‘ప్రపంచంలోనే ప్రసిద్ధ సిక్కు మందిరంపై విధ్వంసకర దాడి జరిగింది. పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేక వైఖరి తీసుకున్నవారు వాస్తవాలు గ్రహించాలి. ఇలాంటి అన్యాయాన్ని, హింసను, అమానవీయ ఘటనలను పట్టించుకోకపోవడం లౌకికవాదం అనిపించుకోదు. ఒక భారత పౌరుడిగా, ఒక సిక్కుగా ఈ విషయం చెబుతున్నా’’ అని హర్దీప్‌ సింగ్‌ అన్నారు. పాక్‌లో మైనారిటీలపై దాడులకు సంబంధించి ఆధారాలు కోరుకునేవారికి శుక్రవారం నాటి దాడే ఉదాహరణ అని వివరించారు. సీఏఏని వ్యతిరేకించేవారంతా ఈ దాడి ఘటన అనంతరమైనా ఓ సారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌కు చెందిన ముస్లిమేతర మతాల వారు శరణార్థులుగా వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో సీఏఏని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. పాక్‌లో ఈ దాడి జరగడం భాజపా చేతికి ఓ అస్త్రం దొరికినట్లైంది.

ఇదీ చదవండి..
పాక్‌లో గురుద్వారాపై దాడి..ఖండించిన భారత్‌..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు