ఇరాక్‌ నుంచి వైదొలిగే యోచనేమీ లేదు:అమెరికా

ఇరాక్‌ నుంచి అమెరికా బలగాల్ని ఉపసంహరించుకోవడంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ స్పష్టం చేశారు.......

Published : 07 Jan 2020 10:48 IST

బలగాల్ని ఉపసంహరించుకున్నట్లు వచ్చిన లేఖపై పెంటగాన్‌ స్పందన

వాషింగ్టన్‌: ఇరాక్‌ నుంచి అమెరికా బలగాల్ని ఉపసంహరించుకోవడంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ స్పష్టం చేశారు. అంతకుముందు యూఎస్‌ సైనికులు దేశం విడిచి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుపుతూ అమెరికా సైన్యం ఇరాక్‌ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఎస్పర్‌ స్పందిస్తూ అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని తెలిపారు. అయితే ఆ లేఖపై తనకు సమాచారం లేదని.. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఇరాక్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌)పై పోరుకు అమెరికా ఇంకా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 

దీనిపై ఆ దేశ త్రిదళాధిపతి జనరల్‌ మార్క్‌ మిల్లే సైతం స్పందించారు. లేఖలో పదాలు తప్పుగా దొర్లి ఉంటాయని.. బలగాల ఉపసంహరించుకునే యోచనేమీ లేదని స్పష్టం చేశారు. అయితే లేఖపై అమెరికా ఆర్మీ ఉన్నతాధికారి సంతకం ఉన్నట్లు ఇరాక్‌ అధికారులు ధ్రువీకరించినట్లు ప్రముఖ మీడియా సంస్థలు పేర్కొనడం గమనార్హం. 

‘‘ఇరాక్‌ సౌర్వబౌమాధికారాన్ని గౌరవిస్తూ.. ప్రధాని, పార్లమెంటు కోరిక మేరకు అమెరికా బలగాల్ని రానున్న కొన్ని వారాల్లో మరో ప్రాంతానికి మార్చనున్నాం’’ అని ఉన్న ఓ లేఖ మీడియాలో చక్కర్లు కొట్టింది. 

ఇరాక్‌ పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై తమ భూభాగం నుంచి అమెరికా బలగాలను వెనక్కి పంపేయాలని తీర్మానించిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ.. తాము వైదొలగాలంటే కొన్నేళ్లుగా ఇరాక్‌లో అమెరికా పెట్టిన సైనిక ఖర్చులన్నీ తిరిగి చెల్లించాలని లేదంటే వీడేది లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే సైనికుల్ని ఉపసంహరిస్తున్నట్లు లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని