అంతరిక్షంలోకి ఇడ్లీ, పులావ్‌, హల్వా

ఇడ్లీ-సాంబార్‌, ఉప్మా, వెజ్‌ పులావ్‌, హల్వా.. ఏంటీ చదవగానే నోట్లో ఉవ్విళ్లూరుతున్నాయా.. అయితే కాస్త ఆగండి. ఇవన్నీ మీకోసం కాదు.. త్వరలో అంతరిక్షంలోకి వెళ్లే మన వ్యోమగాముల కోసం. అవునండి..

Published : 07 Jan 2020 14:48 IST

గగనయాన్‌ వ్యోమగాములకు ప్రత్యేకమైన దేశీ మెనూ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇడ్లీ-సాంబార్‌, ఉప్మా, వెజ్‌ పులావ్‌, హల్వా.. ఏంటీ చదవగానే నోట్లో ఉవ్విళ్లూరుతున్నాయా.. అయితే కాస్త ఆగండి. ఇవన్నీ మీకోసం కాదు.. త్వరలో అంతరిక్షంలోకి వెళ్లే మన వ్యోమగాముల కోసం. అవునండి.. గగన్‌యాన్‌ మిషన్ ద్వారా రోదసీ యాత్రకు వెళ్లే వ్యోమగాముల కోసం ప్రత్యేకమైన ఆహారాన్ని తయారుచేసింది మైసూరులోని డిఫెర్స్‌ ఫుడ్‌ రీసర్చ్‌ లాబొరేటరీ.

డిఫెన్స్‌ రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీవో) ఆధ్వర్యంలో పనిచేసే ఈ ల్యాబ్‌.. గగన్‌యాన్‌ వ్యోమగాముల కోసం దాదాపు 30 రకాల వంటకాలను తయారుచేసింది. ఇందులో ఇడ్లీ-సాంబార్‌, వెజ్‌ పులావ్‌, ఉప్మా, పెసరపప్పు హల్వా, వెజ్‌ రోల్స్‌, ఎగ్‌ రోల్స్‌ తదితర వంటకాలున్నాయి. అంతేగాక, ఆహార పదార్థాలను వేడి చేసుకోవడం కోసం ఫుడ్‌ హీటర్స్‌ను కూడా వ్యోమగాములతో పంపిస్తున్నారట. ఇక అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు గనుక.. వ్యోమగాములు నీరు, పండ్లరసాల వంటి ద్రవపదార్థాలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన కంటెయినర్లను కూడా తయారుచేశారు.  

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే దేశీయ తొలి మానవసహిత రోదసీ యాత్ర గగన్‌యాన్‌ ప్రాజెక్టు కోసం ఇప్పటికే నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసినట్లు ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వీరంతా భారత వాయుసేనకు చెందిన పైలట్లే. అయితే వీరి పేరు వివరాలను శివన్‌ వెల్లడించలేదు. జనవరి మూడో వారం నుంచి వీరికి రష్యాలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 2018 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారిగా ఈ గగన్‌యాన్‌ ప్రాజెక్ట్‌ గురించి ప్రకటించారు. దాదాపు రూ.10వేల కోట్లతో ఇస్రో ఈ రోదసీ యాత్ర చేపట్టనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని