విమాన ప్రమాదం ‘మిస్టరీ’ ఏంటో?

టెహ్రాన్‌: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ విమానాశ్రయానికి సమీపంలో చోటు చేసుకున్న ఉక్రెయిన్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు. అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రమాదంపై అనేక ఊహాగానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా........

Published : 08 Jan 2020 18:06 IST

బ్లాక్‌బాక్స్‌ ఇవ్వనంటోన్న ఇరాన్‌

రెండు రోజుల కిందే చెక్‌ చేశామన్న బోయింగ్‌

టెహ్రాన్‌: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ విమానాశ్రయానికి సమీపంలో చోటు చేసుకున్న ఉక్రెయిన్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు. అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రమాదంపై అనేక ఊహాగానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా విమానానికి చెందిన బ్లాక్‌బాక్స్‌ను బోయింగ్‌ కంపెనీకి ఇచ్చేందుకు ఇరాన్‌ నిరాకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

ప్రమాదానికి గురైన ఉక్రెయిన్‌ విమానం నుంచి రెండు బ్లాక్‌బాక్స్‌లను ఇరాన్‌ రెస్క్యూ బృందం సేకరించింది. అయితే ఈ బ్లాక్‌బాక్స్‌లను బోయింగ్‌కు ఇచ్చేందుకు ఇరాన్‌ నిరాకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 

ఉక్రెయిన్‌ ఏమందంటే..

మరోవైపు ఇంజిన్‌ వైఫల్యం కారణంగానే విమానం కూలిందని తొలుత చెప్పిన ఉక్రెయిన్‌.. ఇప్పుడు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది. ఘటన తర్వాత స్పందించిన ఉక్రెయిన్‌.. ప్రమాదం వెనుక ఎలాంటి ఉగ్రకోణం లేదని, క్షిపణి దాడి జరగలేదని పేర్కొంది. ఇంజిన్‌ విఫలమవడం వల్లే కూలినట్లు తెలిపింది. అయితే తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. అందులో ఇంజిన్‌ వైఫల్యం అనే పదాన్ని తొలగించింది. ప్రమాదానికి గల కారణాన్ని ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు తర్వాతే ఓ అంచనాకు రాగలమని వెల్లడించింది. ప్రమాదంపై ఇంతకు ముందు ఇచ్చిన ప్రకటన అధికారికం కాదని తెలిపింది. ఘటనకు గల కారణాలపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని ఉక్రెయిన్‌ ప్రధాని చెప్పారు. 

విమానం బానే ఉందా..

ఘటనపై బోయింగ్‌ సంస్థ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే విమానాన్ని రెండు రోజుల ముందే చెక్‌ చేశామని, అంతా బాగానే ఉందని పేర్కొంది. ‘ప్రమాదానికి గురైన విమానాన్ని 2016లో తయారుచేశాం. బోయింట్‌ ఫ్యాక్టరీ నుంచి నేరుగా ఎయిర్‌లైన్‌కు అందించాం. జనవరి 6నే టెక్నికల్‌ మెయింటనెన్స్‌ నిర్వహించాం’ అని బోయింగ్‌ తెలిపింది.  

ఇరానీయులే ఎక్కువ..

ప్రమాదం జరిగిన విమానంలో ఉక్రెయిన్‌ దేశస్థుల కంటే విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. ప్రయాణికుల్లో 82 మంది ఇరానీయులు కాగా.. కెనడాకు చెందిన 63 మంది, స్వీడన్‌కు చెందిన 10, ఉక్రెయిన్‌కు చెందిన 11 మంది, అఫ్గాన్‌కు చెందిన నలుగురు, జర్మనీకి చెందిన ముగ్గురు, బ్రిటన్‌కు చెందిన ముగ్గురు ఉన్నారు. మరో తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు.  

గాల్లోనే మంటలు..

విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానం రాడార్‌తో సంబంధాలు తెగిపోయింది. దీనిపై ఇరాన్‌ స్పందిస్తూ.. విమానం కుప్పకూలిన తర్వాత మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయిందని చెప్పింది. అయితే ప్రమాదానికి సంబంధించిన వీడియోల్లో మాత్రం గాల్లో ఉండగానే విమానానికి నిప్పంటుకున్నట్లు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదం ఓ మిస్టరీగా మారింది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని