బ్రిటన్‌ రాజకుటుంబంలో వేరుకుంపట్లు

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 కుటుంబంలో మనస్పర్థలు వచ్చాయా..? ప్రిన్స్‌ విలియమ్‌, ప్రిన్స్‌ హ్యారీ దంపతులకు పొసగడం లేదా..? గత కొంతకాలంగా ఇంగ్లాండ్‌ సహా యావత్‌ ప్రపంచవాసులను తొలిచేస్తున్న ఈ 

Published : 09 Jan 2020 14:44 IST

ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ల సంచలన నిర్ణయం

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 కుటుంబంలో మనస్పర్థలు వచ్చాయా..? ప్రిన్స్‌ విలియమ్‌, ప్రిన్స్‌ హ్యారీ దంపతులకు పొసగడం లేదా..? గత కొంతకాలంగా ఇంగ్లాండ్‌ సహా యావత్‌ ప్రపంచవాసులను తొలిచేస్తున్న ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా ప్రిన్స్‌ హ్యారీ-మేఘన్‌ మర్కెల్‌ సంచలన ప్రకటన చేశారు. రాజకుటుంబం నుంచి తాము వేరుపడుతున్నామని, ఇకపై రాజకుటుంబంలో సీనియర్‌ సభ్యులుగా ఉండబోమని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ఓ లేఖ ద్వారా రాణి ఎలిజబెత్‌కు వెల్లడించారు. 

అటు ససెక్స్‌ రాయల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలోనూ వీరు సుదీర్ఘ, భావోద్వేగ పోస్ట్‌ చేశారు. ‘కొన్ని నెలలుగా ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఆర్థికంగా మేం స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాం. అందుకే ఇకపై రాజకుటుంబంలో సీనియర్‌ సభ్యులుగా ఉండబోం’ అని హ్యారీ, మేఘన్‌ పేర్కొన్నారు. ఇకపై తాము ఉత్తర అమెరికాలో సమయం గడుపుతామని, అయితే రాణి ఎలిజబెత్‌ 2కు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కాగా.. తమ కుమారుడిని మాత్రం రాజకుటుంబ సంప్రదాయాలతోనే పెంచుతామని వెల్లడించారు. 

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2, తమ తండ్రి ప్రిన్స్‌ ఛార్లెస్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ప్రిన్స్‌ హ్యారీ దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ సంచలన ప్రకటనతో రాణి ఎలిజబెత్‌ దిగ్భ్రాంతికి గురైనట్లు తెలుస్తోంది. అటు బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ కూడా హ్యారీ నిర్ణయంపై ఓ ప్రకటన చేసింది. అయితే దీనిపై హ్యారీ దంపతులతో చర్చలు జరుగుతున్నాయని దీనిలో పేర్కొంది. ‘ప్రిన్స్‌ హ్యారీ కోరికను మేం అర్థం చేసుకోగలం. కానీ, దీని వల్ల సమస్యలు రావొచ్చు’ అని బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ ప్రకటనలో తెలిపింది. 

2018 మే నెలలో ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఏడాది క్రితం వీరికి కుమారుడు ఆర్చీ పుట్టాడు. అయితే గత కొంతకాలంగా మీడియా ప్రతినిధుల కారణంగా రాజకుటుంబంలో మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ప్రిన్స్‌ హ్యారీ గతంలో బహిరంగంగానే మాట్లాడారు. తన సోదరుడు విలియమ్‌తో బంధంలో తనకు మంచితో పాటు చెడు రోజులు కూడా ఉన్నాయని అన్నారు. మీడియాలో వచ్చే ప్రతికూల కథనాలతో కూడా ఎంతో వేదనకు గురయ్యామన్నారు. ఇటీవల శాండ్రిగ్‌హమ్‌లో జరిగిన రాజకుటుంబ సంప్రదాయ క్రిస్మస్‌ వేడుకలకు కూడా ప్రిన్స్‌ హ్యారీ దంపతులు దూరంగా ఉన్నారు. మేఘన్‌ తల్లి డోరియా రాగ్లాండ్‌తో కలిసి వీరు క్రిస్మస్‌ జరుపుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని