36ఏళ్ల తర్వాత.. మళ్లీ నలుగురికి ఉరి

యావత్‌ దేశ ప్రజల్లో ఆగ్రహజ్వాల రగిలించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు అంతిమ సమయం ఆసన్నమైంది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 22న ఉదయం 7 గంటలకు తిహార్‌లో జైల్లోని మూడో

Published : 09 Jan 2020 16:25 IST

పుణె: యావత్‌ దేశ ప్రజల్లో ఆగ్రహజ్వాల రగిలించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు అంతిమ సమయం ఆసన్నమైంది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 22న ఉదయం 7 గంటలకు తిహాడ్‌ జైల్లోని మూడో నంబరు గదిలో నలుగురు దోషులను ఉరితీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇలా ఒకే రోజు నలుగురిని ఉరితీయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కాదు. దాదాపు 36ఏళ్ల క్రితం 1983లో ‘జోషి-అభ్యాంకర్ వరుస హత్యల’ కేసులో దోషులు నలుగురినీ పుణెలోని ఎరవాడ జైల్లో ఒకే రోజు ఉరితీశారు. 

1976-77 మధ్య పుణెలో చోటుచేసుకున్న ఈ వరుస హత్యలు మహారాష్ట్ర ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. పుణెలోని అభినవ్‌ కాలా మహావిద్యాలయలో ఆర్ట్స్‌ చదువుతున్న నలుగురు విద్యార్థులు రాజేంద్ర జక్కళ్‌, దిలీప్‌ సుతార్‌, శాంతారామ్‌ జగ్తప్‌, మునావర్‌ హరుణ్‌ షా మద్యానికి బానిసై డబ్బు కోసం దొంగతనానికి అలవాటు పడ్డారు. 1976 జనవరి 16న తొలిసారిగా తమతో పాటు చదివే ప్రసాద్‌ హెగ్దే అనే విద్యార్థిని కిడ్నాప్‌ చేశారు. అనంతరం అతడిని హత్య చేశారు. ఆ తర్వాత అక్టోబరు 1976 నుంచి 1977 మార్చి మధ్య మరో నలుగురిని అతి కిరాతకంగా చంపేశారు. 

పట్టపగలే ఇళ్లలోకి చొరబడి కుటుంబసభ్యులను బెదిరించి దోపిడీకి పాల్పడేవారు. ఆ తర్వాత బాధితులను గొంతునులిమి హత్య చేసేవారు. అప్పట్లో ఈ వరుస హత్యలో మహారాష్ట్ర వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పుణె పోలీసులు ముమ్మర దర్యాప్తు జరిపి నలుగురు విద్యార్థులను అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరికి సహకరించిన సుహాస్‌ చందక్‌ అనే మరో విద్యార్థి అప్రూవర్‌గా మారి హత్యల గురించి చెప్పడంతో నలుగురిని అరెస్టు చేశారు. 

1978లో కేసు విచారణ ప్రారంభం కాగా.. నాలుగు నెలల్లోనే దోషులకు ఉరిశిక్ష విధిస్తూ పుణె సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. బాంబే హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. ఆ తర్వాత దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. వారి అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. రాష్ట్రపతి కూడా క్షమాభిక్షను తిరస్కరించడంతో 1983 నవంబరులో ఎరవాడ సెంట్రల్‌ జైలులో ఈ నలుగురిని ఒకేసారి ఉరితీశారు. మళ్లీ ఇన్నేళ్లకు నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఒకేరోజు ఉరి శిక్ష అమలు చేయనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని