ఆయుధాగారంపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడి..?

ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా లేవు. తాజాగా ఇరాన్‌  మద్దుతు ఉన్న పాపులర్‌ మొబిలైజేషన్‌ దళాలకు చెందిన ఆయుధాగారంపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడి నిర్వహించినట్లు భావిస్తున్నారు. ఇరాక్‌-సిరియా సరిహద్దుల్లో ఉన్న అల్బు కమాల్‌ అనే ప్రదేశంలో నేటి ఉదయం యుద్ధవిమనాలు సంచారించాయి. ఈ క్రమంలో అక్కడ భారీ పేలుళ్లు జరిగాయి.

Updated : 10 Jan 2020 12:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా లేవు. తాజాగా ఇరాన్‌  మద్దుతు ఉన్న పాపులర్‌ మొబిలైజేషన్‌ దళాలకు చెందిన ఆయుధాగారంపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడి నిర్వహించినట్లు భావిస్తున్నారు. ఇరాక్‌-సిరియా సరిహద్దుల్లో ఉన్న అల్బు కమాల్‌ అనే ప్రదేశంలో నేటి ఉదయం యుద్ధ విమానాలు సంచారించాయి. ఈ క్రమంలో అక్కడ భారీ పేలుళ్లు జరిగాయి. ఈ విషయాన్ని అరబిక్‌ మీడియా సంస్థ  డెర్రెజ్జార్‌24 పేర్కొంది. లెబనాన్‌కు చెందిన అల్‌ మైదీన్‌ న్యూస్‌ సంస్థ కూడా ఇజ్రాయిల్‌ విమానాలే ఈ దాడి చేసినట్లు పేర్కొంది. ఇటీవల ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేసింది. ఆ మర్నాడే బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌పై పాపులర్‌ మొబిలైజేషన్‌ దళాలు రెండు రాకెట్లను ప్రయోగించాయి. ఈ నేపథ్యంలో నేడు పీఎంఎఫ్‌కు చెందిన స్థావరాలపై యుద్ధవిమానాలు బాంబులు కురిపించడం గమనార్హం. ఈ దాడులపై ఇజ్రాయిల్ కానీ, అమెరికా కానీ ఇప్పటి వరకు నోరుమెదపలేదు. ఈ దాడిలో ఇజ్రాయిల్‌కు చెందిన ఎఫ్‌-35స్టెల్త్‌ విమానాలు పాల్గొన్నట్లు అరబిక్‌ పత్రికలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 

ఇక్కడే దాడులు ఎందుకు..? 

ఇరాన్‌ ప్రోత్సాహిత ముఠాలైన హెజ్బోల్లా వంటి వాటికి ఆయుధాలను సరఫరా చేసేందుకు ఈ ప్రదేశం చాలా కీలకమైంది. ఇరాన్‌ నుంచి ఇక్కడికి చేరే ఆయుధాలు వివిధ ప్రదేశాలకు సరఫరా అవుతాయి. తాజాగా జరిగిన దాడిలో ఇమామ్‌ అలీ బ్రిగేడ్‌కు చెందిన బాలిస్టిక్‌ క్షిపణులు కూడా ధ్వంసమైనట్లు టైమ్స్‌ఆఫ్‌ ఇజ్రాయిల్‌ పత్రిక వెల్లడించింది. సెప్టెంబర్‌ 9వ తేదీన కూడా ఇక్కడ వైమానిక దాడి జరిగింది. ఇమామ్‌ అలీ కాంపౌండ్‌గా వ్యవహరించే ఇక్కడ భారీ ఆయుధాగారం ఉంది. దీనిని అప్పట్లో సులేమానీ నేతృత్వంలోని ఖుద్స్‌ఫోర్స్‌ నేరుగా పర్యవేక్షించేంది. ఇక్కడి నుంచి చుట్టుపక్కల దేశాల్లోని ఇరాన్‌ అనుకూల రెబల్స్‌కు ఆయుధాలను వేగంగా చేరవేసేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని