
పాక్.. చీకటి కళలకు ఉత్తమ ఉదాహరణ
ఐరాస వేదికగా భారత్ దీటైన సమాధానం
యునైటెడ్ నేషన్స్: అంతర్జాతీయ వేదికగా భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించిన దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ దీటుగా బదులిచ్చింది. చీకటి కళలకు పాక్ ఉత్తమ ఉదాహరణ అని విమర్శించింది. ఆ దేశం చేసే అబద్ధపు ఆరోపణలు, కుట్రలను ఇక్కడ ఎవరూ అంగీకరించరని స్పష్టం చేసింది.
అంతర్జాతీయ శాంతి భద్రతల అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో గురువారం ఓపెన్ డిబేట్ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం, కమ్యూనికేషన్ వ్యవస్థపై ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టింది. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని నిలువరించేలా ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని ఐరాసలోని పాక్ రాయబారి మునీర్ అక్రమ్ కోరారు.
కాగా.. పాక్ విమర్శలను, ఆరోపణలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. ‘చీకటి కళలకు చక్కటి ఉదాహరణ అయిన ఓ ప్రతినిధుల బృందం(పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ) మరోసారి అబద్ధాలను ప్రచారం చేస్తూ తన నైజాన్ని ప్రదర్శించింది. వీటిని మేం కొట్టిపారేస్తున్నాం. పాకిస్థాన్‌కు మా సమాధానం ఒక్కటే.. ముందు మీ దేశంలో ఉన్న సమస్యలను చూసుకుని వాటిని పరిష్కరించుకోండి. మీ అబద్ధపు కుట్రలను సాగనిచ్చేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు’ అని ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టంగా చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.