ప్రమాదంలో పిల్లలను కాపాడినందుకు తల్లికి శిక్ష

అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ముందుగా ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని రక్షిస్తాం. తర్వాత ముఖ్యమైన వస్తువులేమైనా ఉంటే వాటిని భద్రంగా బయటికి తెచ్చుకుంటాం. కానీ ఇందుకు విరుద్ధంగా ఓ

Published : 10 Jan 2020 20:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ముందుగా ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని రక్షిస్తాం. తర్వాత ముఖ్యమైన వస్తువులేమైనా ఉంటే వాటిని భద్రంగా బయటికి తెచ్చుకుంటాం. కానీ, ఇందుకు విరుద్ధంగా ఓ తల్లి అగ్నిప్రమాదం నుంచి దేశ నాయకుల ఫొటోలను కాకుండా తన పిల్లలను కాపాడుకున్నందుకు ఆమె జైలు శిక్ష అనుభవించనుంది. ఇదేంటి వింతగా ఉంది అనుకుంటున్నారా.... అంతేమరి ఆ దేశ చట్టాల ప్రకారం ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ముందుగా ఆ దేశ నాయకుల ఫొటోలను రక్షించాలి...ఇంతకీ ఆ దేశం ఏంటనేగా మీ సందేహం... అదే ఉత్తర కొరియా, ఆ నాయకులు కిమ్‌ జోంగ్ ఉన్‌ కుటుంబసభ్యులు.

వివరాల్లోకి వెళితే... ఉత్తర కొరియాలోని నార్త్ హామ్‌గ్యాంగ్‌ ప్రావిన్స్‌లోని ఒన్సోంగ్ కౌంటీలో ఒక ఇంటిలో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ప్రమాద విషయం తెలిసి వారి తల్లి పరిగెత్తుకెళ్లి వారిని రక్షించింది. ఆ ప్రయత్నంలో వారు ఉంటున్న ఇల్లు పూర్తిగా దగ్థమయింది. అయితే ఆ మంటల్లో ఆ దేశ మాజీ నాయకులైన కిమ్‌ ఇల్ సంగ్, కిమ్‌ జోంగ్ ఇల్ ఫొటోలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో దేశ నాయకుల ఫొటోలను మంటల నుంచి కాపాడలేకపోయినందుకు ఆమెపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె నేరం రుజువైతే 15 ఏళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఉత్తర కొరియా చట్టాల ప్రకారం కిమ్‌ కుటుంబంలో చనిపోయిన నాయకులను బతిన వారిగా భావిస్తూ వారి ఫొటోలను ఆ దేశంలో ప్రతి పౌరుడూ తమ ఇళ్లలో ప్రదర్శించాలి. వాటికంటే పైన మరే ఇతర ఫొటోలు ఉండకూడదు. ఎప్పుడూ వాటిని శుభ్రపరుస్తూ ఉండాలి. ఒక వేళ ఫొటోలను గౌరవించడం, భద్రపరచే విషయంలో లోపాలు జరిగితే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఈ ఫొటోలను పరిశీలించేందుకు అప్పుడప్పుడు పోలీసులు తనీఖీలు నిర్వహిస్తుంటారు. అగ్నిప్రమాదాలు, వరదల వంటివి సంభవించినప్పుడు ఫొటోలను కాపాడుతూ ఎవరైనా పౌరులు చనిపోతే వారిని హీరోలుగా కీర్తిస్తారు. అయితే విచారణ జరుగుతున్నందున ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను చూసేందుకు కూడా పోలీసులు వారి తల్లిని అనుమతించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని