అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలు తగ్గినట్లేనా..?

గత పది రోజులుగా అమెరికాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలకాలని ఇరాన్‌ యోచిస్తున్నట్లు ఆదివారం సంకేతాలు వెలువడ్డాయి. మరోవైపు చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని...........

Published : 13 Jan 2020 10:10 IST

 

టెహ్రాన్‌: గత పది రోజులుగా అమెరికాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలకాలని ఇరాన్‌ యోచిస్తున్నట్లు ఆదివారం సంకేతాలు వెలువడ్డాయి. మరోవైపు చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని అమెరికా తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ మేజర్‌ జనరల్‌ సులేమానీ హత్య తరవాత పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు సద్దుమణిగే సూచనలు కనిపిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికీ ఇరాన్‌తో చర్చలకు సిద్ధంగానే ఉన్నారని ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా ఇరాన్‌తో సమావేశానికి అమెరికా ఆసక్తి చూపుతున్నప్పటికీ.. ఆంక్షలు ఎత్తివేస్తేనే తాము చర్చలకు వస్తామని ఇరాన్‌ వాదిస్తోందన్నారు. ఇరాన్‌తో ఒప్పందానికి తానెప్పుడూ సిద్ధమేనని ట్రంప్‌ సైతం పలుసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు ఆదివారం ఇరాన్‌ అధ్యక్షడు హసన్‌ రౌహానీతో భేటీ అయిన ఖతార్‌ రాజు షేక్‌ తామిమ్‌ బిన్‌ హమద్‌ అల్‌-థానీ.. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు సద్దుమణగాలంటే తాజా ఉద్రిక్తతలకు స్వస్తి పలకాలన్న విధానానికి ఇరాన్‌ అంగీకరించిందని వెల్లడించారు. పశ్చిమాసియా ప్రాంత భద్రతను దృష్టిలో ఉంచుకొని మరింత విస్తృత స్థాయి సంప్రదింపులు, సహకారాన్ని కొనసాగించేందుకు రౌహానీ అంగీకరించారన్నారు. అలాగే బుధవారం అమెరికా స్థావరాలపై ఐఆర్‌జీసీ జరిపిన క్షిపణి దాడులు అక్కడి సైనికుల్ని చంపాలనే ఉద్దేశంతో చేయలేదని కమాండర్‌ హుస్సేన్‌ సలామీ వివరించడం గమనార్హం.

మరోవైపు ఉక్రెయిన్‌ విమానాన్ని పొరపాటున తామే కూల్చామని ఇరాన్‌ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశంలో ఆందోళనలు చెలరేగాయి. వీటిని అదుపు చేసే క్రమంలోనే ఇరాన్‌ పోలీసులు బ్రిటన్‌ రాయబారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అంతర్జాతీయ సమాజం నుంచి ఇరాన్‌ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలోనూ ఇరాన్‌ వెనక్కి తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ.. అంతర్గత ఆందోళనలు, అమెరికా ఆంక్షలతో ఇరాన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోందని అభిప్రాయపడ్డారు. ఇక చర్చలకు రావాల్సిన  తప్పనిసరి పరిస్థితులు తలెత్తాయన్నారు. ఇరాన్‌తో ఒప్పందానికి తాను సిద్ధంగానే ఉన్నానన్నారు.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు