
కాశీలో సంప్రదాయ దుస్తుల నియమం..
నూతన నిబంధనలు తీసుకొచ్చిన వారణాసి ఆలయం
వారణాసి: ఉత్తరభారతంలోని ప్రసిద్ధ కాశీ పుణ్యక్షేత్రంలో జ్యోతిర్లింగాల్ని తాకాలంటే ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే. ఈ మేరకు గర్భగుడిలోకి వచ్చే భక్తులకు డ్రెస్‌కోడ్ అమలు చేయాలని వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం నిర్ణయించింది. జ్యోతిర్లింగం స్పర్శ దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ధోతీ-కుర్తా, చీర లాంటి సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది.
కాశీ విద్వత్ పరిషత్‌తో సమావేశమైన అనంతరం ఆలయ పాలనా విభాగం ఈ మేరకు నూతన నిబంధనలు తీసుకొచ్చింది. ప్యాంట్, షర్ట్, జీన్స్, టీషర్ట్ లాంటి మోడ్రన్ దుస్తులు ధరించి వచ్చే భక్తులు ఇకపై దూరం నుంచి మాత్రమే విశ్వేశ్వరుడిని దర్శించుకునే వీలుంటుందని, వారిని గర్భగుడిలోకి అనుమతించబోమని ఆలయ అధికారులు వెల్లడించారు. జ్యోతిర్లింగం స్పర్శ దర్శనం చేసుకోవాలంటే పురుషులు తప్పనిసరిగా ధోతీ-కుర్తా, మహిళలు చీర ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ నూతన నిబంధనలను ఆలయ పాలనా విభాగం అతి త్వరలోనే అమలు చేయనున్నట్లు యూపీ పర్యాటక మంత్రి డాక్టర్ నీలకంఠ్ తివారీ వెల్లడించారు. దీంతోపాటు అర్చకులను సులువుగా గుర్తించేందుకు వీలుగా వారికి కూడా ఓ డ్రెస్‌కోడ్ తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ పాటు దక్షిణ భారతంలోని పలు ఆలయాల్లో సంప్రదాయ దుస్తులనే ధరించాలన్న నియమం ఉన్న విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.