రోడ్డు బాగుచేసేందుకు స్కూల్‌ ఎగ్గొట్టి..

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 85 మంది ఒకే గ్రామానికి చెందిన విద్యార్థులు ఒకే రోజు స్కూల్‌ ఎగ్గొట్టారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా..! అయితే వారు బంక్‌ కొట్టింది

Published : 16 Jan 2020 04:27 IST

ఔరంగాబాద్‌: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 85 మంది ఒకే గ్రామానికి చెందిన విద్యార్థులు ఒకే రోజు స్కూల్‌ ఎగ్గొట్టారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా..! అయితే వారు బంక్‌ కొట్టింది స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేక కాదు.. చదువుపై మమకారంతో.. వారు పాఠశాలకు వెళ్లాలంటే బస్సు రావాలి, బస్సు రావాలంటే రోడ్డు బాగుండాలి.. అందుకే రోడ్డు బాగు చేసేందుకు ఆ విద్యార్థులంతా స్కూల్‌ మానేసి శ్రమించారు. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా ధమన్‌గావ్‌ రాజూర్‌ గ్రామంలో 18 కిలోమీటర్ల రహదారి నిర్మించేందుకు గతేడాది ముఖ్యమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన కింద ఉత్తర్వులు వచ్చాయి. అయితే స్థానిక అధికారులు ఆ రోడ్డును పూర్తిచేయకుండా మధ్యలోనే వదిలేశారు. రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో బద్నాపూర్‌ డిపో నుంచి ఈ గ్రామానికి వచ్చే బస్సు సర్వీసును గతేడాది డిసెంబరు నుంచి నిలిపివేశారు. 

ఈ గ్రామానికి చెందిన చాలా మంది పిల్లలు సమీపంలోని దభడీ గ్రామంలో ఉండే స్కూల్లో చదువుతున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే బస్సు ఎక్కాల్సిందే. అయితే గత నెల రోజులకు పైగా బస్సు సర్వీసు లేకపోవడంతో విద్యార్థులు 10 కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులంతా కలిసి రోడ్డు బాగుచేసేందుకు పూనుకున్నారు. ఈ నెల 10న వీరంతా స్కూల్‌ మానేసి రోడ్డుపై కిలోమీటర మేర ఉండిపోయిన రాళ్లను తొలగించి రాకపోకలకు అనువుగా చేశారు. త్వరలోనే వారి ఊరికి మళ్లీ బస్సు రానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని