మహతీర్‌ వ్యాఖ్యలతో మలేషియాకు నష్టమే..

పామాయిల్ దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు అతి పెద్ద పామాయిల్ ఎగుమతిదారుగా ఉన్న మలేషియాపై ఈ పరిణామం తీవ్ర ప్రభావం...

Updated : 14 Jan 2020 18:37 IST

కౌలాలంపూర్‌: మలేషియా నుంచి పామాయిల్ దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు అతి పెద్ద పామాయిల్ ఎగుమతిదారుగా ఉన్న ఆ దేశంపై ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపనుంది. తాజాగా దీనిపై మలేషియా ప్రధాని మహతీర్‌ మహ్మద్ స్పందించారు. భారత్ విధించిన ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘భారత్‌కు మేము అధిక మొత్తంలో పామాయిల్‌ ఎగుమతి చేస్తున్నందున తాజా ఆంక్షలు మా దేశ పామాయిల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది మాకు ఆందోళన కలిగించే విషయం’’ అని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై మహతీర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ దేశ దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. అయితే రెండు దేశాలు దౌత్యపరమైన చర్చలు ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మలేషియా ట్రేడ్స్ యూనియన్‌ కాంగ్రెస్‌ ఇరు దేశాలను కోరింది.

గతేడాది మలేషియా నుంచి 4.4 మిలియన్‌ టన్నుల పామాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంది. తాజా ఆంక్షల నేపథ్యంలో ఈ దిగుమతులు ఒక మిలియన్‌ టన్నులకు పడిపోయే అవకాశం ఉన్నట్లు భారత వ్యాపార వర్గాలు అభిప్రాయపడ్డాయి. మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకోవద్దన్న భారత్ ఆంక్షల నేపథ్యంలో ఇండోనేషియా నుంచి టన్నుకు పది డాలర్లు అధిక మొత్తంలో చెల్లించి పామాయిల్ కొనుగోలు చేస్తున్నట్లు భారత వ్యాపారులు తెలిపారు. ఇతర దేశాల అంతరంగిక అంశాల్లో జోక్యం చేసుకోవడంపై మహతీర్‌పై ఆ దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. మలేషియా ఆర్థిక ప్రగతికి మహతీర్ వ్యాఖ్యలు నష్టం చేకూరుస్తాయని వాణిజ్యవర్గాలు మండిపడుతున్నాయి. అయితే మహతీర్‌ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని