ఆర్టికల్ 370 రద్దు చరిత్రాత్మక నిర్ణయం: ఆర్మీ చీఫ్

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్ధు చరిత్రాత్మక నిర్ణయం అని ఆర్మీ చీఫ్‌ జనరల్ ఎం.ఎం.నరవణే అన్నారు. ఇది జమ్ముకశ్మీర్‌ను దేశంలో ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు...

Updated : 15 Jan 2020 17:02 IST

దిల్లీ: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్ధు చరిత్రాత్మక నిర్ణయం అని ఆర్మీ చీఫ్‌ జనరల్ ఎం.ఎం.నరవణే అన్నారు. ఇది జమ్ముకశ్మీర్‌ను దేశంలో ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. దిల్లీలో జరిగిన 72వ ఆర్మీ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నరవణే  మాట్లాడుతూ ‘‘ఆర్టికల్ 370 రద్దు చరిత్రాత్మక నిర్ణయం. దీని ద్వారా మనతో పరోక్ష యుద్ధం చేస్తున్న పొరుగు దేశం పాకిస్థాన్‌ భంగపాటుకు గురైంది. అంతేకాకుండా ఆర్టికల్ 370 రద్దు జమ్ముకశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపేందుకు ఎంతో సహాయపడుతుంది. సాయుధ దళాలు ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సహించవు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అవసరమైతే వాటిని ఉపయోగించుకునేందుకు మేము వెనుకాడం. ఆర్మీని భవిష్యత్తు యుద్ధాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారిస్తున్నాం’’ అని అన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన జవాన్లకు పతకాలు బహూకరించారు.

ఈ ఆర్మీ డే వేడుకల్లో దేశ తొలి మహా దళాధిపతి (సీడీఎస్‌) బిపిన్‌ రావత్ పాల్గొని సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకముందు సీడీఎస్‌ బిపిన్‌ రావత్ త్రివిధ దళాధిపతులతో కలిసి జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. ఈ వేడుకల్లో తొలి సారిగా కెప్టెన్ తాన్యా షెర్గిల్‌ అనే మహిళా అధికారి పరేడ్‌కు  నేతృత్వం వహించడం విశేషం. 1949లో అప్పటి భారత ఆర్మీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా బ్రిటీష్‌ ఆర్మీకి చెందిన జనరల్ ఫ్రాన్సిస్‌ బుచర్‌ ఉన్నారు. ఆయన నుంచి భారత కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ కే.ఎం.కరియప్ప బాధ్యతలు స్వీకరించారు. దీన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 15న ఆర్మీ డే వేడుకలను నిర్వహిస్తుంటారు. అయితే భారత తొలి సీడీఎస్‌గా బిపిన్‌ రావత్ నియమితులైన తర్వాత జరుగుతున్న తొలి వేడుకలు కావడంతో వీటికి ప్రాధాన్యం ఏర్పడింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని