నిర్భయ దోషుల ఉరి మరింత ఆలస్యం?

నిర్భయ కేసులో దోషులకు మరణ శిక్షను అమలు చేయాలని ఆదేశిస్తూ జారీ చేసిన డెత్‌ వారెంట్‌లో పేర్కొన్నట్లుగా.. జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయడం సాధ్యం కాదని దిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.......

Published : 16 Jan 2020 04:57 IST

దిల్లీ: నిర్భయ కేసులో దోషులకు మరణ శిక్షను అమలు చేయాలని ఆదేశిస్తూ జారీ చేసిన డెత్‌ వారెంట్‌లో పేర్కొన్నట్లుగా.. జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయడం సాధ్యం కాదని దిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మరణశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ దోషులు ముకేశ్‌ సింగ్‌, వినయ్‌ శర్మ పెట్టుకున్న క్యురేటివ్‌ పిటిషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో క్షమాభిక్ష కోరుతూ ముకేష్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అభ్యర్థన సమర్పించాడు. అలాగే రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు మరణశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో జైలు నిబంధనల ప్రకారం.. క్షమాభిక్షపై రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు ఉరిశిక్ష అమలు చేయలేమని జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ సంగీత ధింగ్రా సెహగల్‌కు దిల్లీ ప్రభుత్వం వివరించింది.

మరోవైపు, ఒకవేళ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించినా.. నిబంధనల ప్రకారం దోషులను ఉరితీయడానికి ముందు కనీసం 14 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని తీహాడ్‌ జైలు అధికారులు కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో నలుగురు దోషుల ఉరిశిక్ష మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని