అమెరికాలో సిక్కులకు ప్రత్యేక గుర్తింపు

అమెరికాలో నివసిస్తున్న సిక్కు మతస్తులకు అరుదైన గుర్తింపు లభించింది. 2020 యూఎస్‌ (సెన్సస్) జనాభా లెక్కల ప్రకారం వారిని ప్రత్యేకమైన జాతిగా గుర్తించనున్నట్లు మైనారిటీ వర్గానికి చెందిన ఓ సంస్థ వెల్లడించింది. ఈ నిర్ణయం పట్ల శాన్‌డిగో సిక్కు సొసైటీ..

Published : 16 Jan 2020 00:04 IST

వాషింగ్టన్‌: అమెరికాలో నివసిస్తున్న సిక్కు మతస్తులకు అరుదైన గుర్తింపు లభించింది. 2020 యూఎస్‌ (సెన్సస్) జనాభా లెక్కల ప్రకారం వారిని ప్రత్యేకమైన జాతిగా గుర్తించనున్నట్లు మైనారిటీ వర్గానికి చెందిన ఓ సంస్థ వెల్లడించింది. ఈ నిర్ణయం పట్ల శాన్‌డిగో సిక్కు సొసైటీ అధ్యక్షుడు బల్జీత్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఏళ్లనాటి కల, కృషి నెరవేరినట్లు అయిందని ఆనందం వ్యక్తం చేశారు. అమెరికాలోని సిక్కు మతస్తులకు మాత్రమే కాకుండా ఇతర మైనారిటీ వర్గాలకు సైతం భవిష్యత్తులో ఇలాంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించేందుకు ఇది ప్రారంభం అని బల్జీత్‌ సింగ్‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యునైటెడ్‌ సిక్కులకు చెందిన ఒక బృందం యూఎస్‌ జననగణన అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. చివరిసారిగా శాన్‌డిగో నగరంలో ఈ ఏడాది జనవరి 6న సమావేశం నిర్వహించారు. ‘అమెరికాలో నివసిస్తున్నటువంటి సిక్కు మతస్తుల కచ్చితమైన జనాభా లెక్క ఉండాలంటే వారికి ఒక ప్రత్యేకమైన కోడ్ అవసరమని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే వారికి ఈ గుర్తింపు లభించనుంది’ అని యుఎస్ సెన్సస్ డిప్యూటీ డైరెక్టర్ రాన్ జార్మిన్ తెలిపారు.

ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో 10 లక్షల మంది సిక్కు జనాభా ఉంది. అమెరికాలోని సిక్కులను ఒక ప్రత్యేక జాతిగా గుర్తించాలని.. వారి జనాభాను నిర్ధరించేందుకు ప్రత్యేక కోడ్‌ ఏర్పాటు చేయాలని గత రెండు దశాబ్దాలుగా సిక్కు మతస్తులు కోరుతున్నారు. యూఎస్‌ ఫెడరల్‌ రిజిస్ట్రీకి కూడా అనేకసార్లు విన్నపాలు సమర్పించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని