త్వరలో జమ్ము కశ్మీర్‌కు కేంద్రమంత్రుల బృందం

జమ్ము కశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఎటువంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆంక్షలను దశలవారిగా సవరిస్తూ వస్తున్న...

Published : 16 Jan 2020 05:14 IST

దిల్లీ: జమ్ము కశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఎటువంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆంక్షలను దశలవారిగా సవరిస్తూ వస్తున్న కేంద్రం తాజాగా బుధవారంనాడు పాక్షికంగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అక్కడి పరిస్థితులను తెలుసుకొనేందుకు త్వరలో కేంద్ర మంత్రుల బృందం జమ్ము కశ్మీర్‌లో పర్యటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దానితో పాటు ప్రభుత్వ పథకాల గురించి, ఆర్టికల్‌ 370 రద్దు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మంత్రుల బృందం అక్కడి ప్రజలకు వివరించనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రుల బృందం జమ్ము కశ్మీర్‌లోని వేర్వేరు జిల్లాల్లో  పర్యటించి అక్కడి ప్రజలతో సంభాషించనున్నారు. అయితే వారి పర్యటనపై క్షేత్ర స్థాయిలో పరిస్థితుల గురించి అందిన నివేదిక ఆధారంగా త్వరలో జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. హోంశాఖ మంత్రి అమిత్‌ షా చొరవతో ఈ పర్యటన చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

ఈ బృందంలో హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డితో పాటు న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ, క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు, ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌, సాంస్కృతికశాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్‌ పటేల్, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్‌ పోక్రియాల్ ఉండనున్నట్లు సమాచారం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి స్థితిగతులను, భద్రతా పరమైన అంశాలను పరిశీలించేందుకు గత వారం 15 మందితో కూడిన విదేశీ రాయబారుల బృందం రెండు రోజుల పాటు జమ్మ కశ్మీర్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని