రాష్ట్రపతికి చేరిన నిర్భయ దోషి క్షమాభిక్ష

నిర్భయ కేసులో దోషి ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వద్దకు చేరింది. నిన్న రాత్రి ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపించినట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి

Published : 17 Jan 2020 10:47 IST

దిల్లీ: నిర్భయ కేసులో దోషి ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వద్దకు చేరింది. నిన్న రాత్రి ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపించినట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కాగా.. ఈ క్షమాభిక్షను తిరస్కరించాలని హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. 

క్షమాభిక్ష కోసం ముఖేశ్ చేసిన అభ్యర్థనను తిరస్కరించాలని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే ఆయన దాన్ని ఆమోదించడం గమనార్హం. క్షమాభిక్ష పిటిషన్‌ను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేంద్ర హోంశాఖకు పంపారు. దీంతోపాటు ఆయన తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు.  తాజాగా హోంశాఖ దాన్ని రాష్ట్రపతి భవన్‌కు పంపించింది. 

నిర్భయ కేసులో నలుగురు దోషుల ఉరికి ఓ వైపు ఏర్పాట్లు జరుగుతుండగా క్షమాభిక్ష రూపంలో ఆటంకం ఏర్పడింది. ముఖేశ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున శిక్ష అమలును వాయిదా వేయాలని దిల్లీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. కారాగార నిబంధనల ప్రకారం.. కేసులో ఒకరికంటే ఎక్కువ మంది దోషులు ఉన్నప్పుడు వారిలో ఒకరు క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నా.. అది తేలే వరకు మిగిలిన వారికీ శిక్షను అమలు చేయడం కుదరదు. దీంతో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు తాత్కాలికంగా నిలిచిపోయింది.

తాజా పరిణామాలపై నిర్భయ తల్లి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఇప్పటి వరకూ నేను రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ 2012లో నా కూతురి కోసం వీధుల్లో ఆందోళన చేసిన కొందరు.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం నిర్భయ మరణంతో ఆడుకుంటున్నారు’ అని ఆమె ఆవేదన చెందారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని