మళ్లీ సుప్రీంకోర్టుకు నిర్భయ దోషి

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు తేదీపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఘటన సమయంలో తాను బాల నేరస్థుడినని

Published : 17 Jan 2020 16:18 IST

దిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు తేదీపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఘటన సమయంలో తాను బాల నేరస్థుడినని, దాని ప్రకారమే విచారణ జరపాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. ఈ మేరకు దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పవన్‌ గుప్తా పిటిషన్‌ దాఖలు చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ తెలిపారు. 

కొత్త డెత్‌వారెంట్‌పై విచారణ..

ఇదిలా ఉండగా.. ఈ కేసులో మరో దోషి ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేడు తిరస్కరించారు. నిజానికి నిర్భయ కేసులో నలుగురు దోషులకు డెత్‌ వారెంట్‌ జారీ చేస్తూ ఇటీవల దిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 22న ఉరితీయాలని ఆదేశించింది. అయితే ముఖేశ్‌ క్షమాభిక్ష పెట్టుకోవడంతో ఈ ఉరితీత అమలు తాత్కాలికంగా నిలిచిపోయింది. 

అయితే తాజాగా ముఖేశ్‌ అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడంతో తాజా డెత్‌ వారెంట్‌ జారీ చేయాలంటూ తిహాడ్‌ జైలు అధికారులు దిల్లీ కోర్టును కోరారు. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారని, అందువల్ల దోషుల ఉరితీతకు కొత్త తేదీ, సమయం చెబుతూ డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని తిహాడ్‌ అధికారుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ న్యాయస్థానాన్ని కోరారు. అయితే క్షమాభిక్ష కొట్టివేత గురించి దోషి ముఖేశ్‌కు సమాచారమిచ్చారా లేదా కోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఇందుకోసం సాయంత్రం 4.30 గంటల వరకు సమయమిస్తూ అప్పటివరకు విచారణను వాయిదా వేసింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని