నేనెందుకు కశ్మీరుకు వెళ్లాలి?

జమ్ము-కశ్మీర్‌ భారత్‌ అంతర్గత వ్యవహారమని, దానిలో తమ ప్రమేయం ఉండదని రష్యా మరోసారి తేల్చిచెప్పింది.

Published : 18 Jan 2020 00:32 IST

కశ్మీరు భారత్‌ అంతర్గత వ్యవహారం... మరోసారి కుండబద్దలు కొట్టిన రష్యా

దిల్లీ: జమ్ము-కశ్మీర్‌ ప్రాంత రాజ్యాంగ స్థితి పునర్వ్యవస్థీకరణ భారత్‌ అంతర్గత వ్యవహారమని, దానిలో తమ ప్రమేయం ఉండదని రష్యా మరోసారి తేల్చిచెప్పింది. ఒక దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం కల్పించుకోకూడదు అనేది ద్వైపాక్షిక సంబంధాల ప్రాథమిక సూత్రాలలో ఒకటని భారత్‌లో రష్యా రాయబారి నికోలాయ్‌ కుదషేవ్‌ గుర్తుచేశారు. పాకిస్థాన్‌ పరంగా కశ్మీరు అంశాన్ని మరోసారి చర్చించాలనే చైనా విజ్ఞప్తిని ఐక్యరాజ్యసమితి రెండోసారి కూడా తోసిపుచ్చింది. ఇది జరిగిన ఒక్కరోజులోనే రష్యా నుంచి ఈ ప్రకటన వెలువడటం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

కశ్మీరు ప్రత్యేక హోదా రద్దైన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారా? అన్న మరో ప్రశ్నకు జవాబుగా కుదషేవ్‌, తనకు అత్యవసరంగా ఆ ప్రదేశానికి వెళ్లవలసిన ఆవశ్యకత లేదన్నారు. ‘‘అక్కడకు వెళ్లడానికి నాకు ఏ కారణమూ లేదు. ఎవరికైనా అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే వారు వెళ్లవచ్చు. కానీ, మేము ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోము’’ అని ఆయన నిర్ద్వంద్వంగా చెప్పారు. ప్రపంచ క్షేమం కోసం అంటూ ఏకపక్షంగా ఉండటం, ఏక ధృవ ప్రపంచాన్ని ఆకాంక్షించటం సరికాదని రష్యా అధ్యక్షుడి ఇటీవలి ప్రసంగంలోని అంశాలను ఆయన ఉటంకించారు. అదే విధంగా భారత విదేశాంగ విధానం ఎవరికీ అభ్యంతరం కానిదని, దేశాలన్నీ దానిని అనుసరిస్తే ప్రపంచం మరింత మెరుగవుతుందని భారత్‌ను ప్రశంసించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని