‘ఐదేళ్లకే ఆ చిన్నారికి చిత్రవధ’

ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య ఘటన జరిగిన కొద్ది నెలలకే దేశ రాజధానిలో మరో ఘోరం చోటుచేసుకుంది. 2013 ఏప్రిల్‌లో తూర్పు దిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై

Published : 19 Jan 2020 00:23 IST

అత్యాచార కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఉద్వేగం

దిల్లీ: ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య ఘటన జరిగిన కొద్ది నెలలకే దేశ రాజధానిలో మరో ఘోరం చోటుచేసుకుంది. 2013 ఏప్రిల్‌లో తూర్పు దిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను దోషులుగా తేలుస్తూ పోస్కో కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. కాగా.. కేసు విచారణ సందర్భంగా అదనపు సెషన్స్‌ జడ్జి నరేశ్ కుమార్‌ మల్హోత్రా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఐదేళ్ల వయసులోనే ఆ చిన్నారి చిత్రవధ అనుభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

‘ఈ ఘటన యావత్ సమాజాన్ని ఎంతగానో కలచివేసింది. మన దేశంలో బాలికలను దేవతలుగా పూజిస్తాం. అలాంటి వారిపై దారుణాలు జరుగుతున్నాయి. ఐదేళ్ల వయసులోనే ఆ చిన్నారి అత్యంత నీచాన్ని, తీవ్రమైన క్రూరత్వాన్ని అనుభవించింది’ అని న్యాయమూర్తి ఉద్వేగానికి గురయ్యారు. ఈ కేసులో మనోజ్‌ షా, ప్రదీప్‌ కుమార్‌ అనే వ్యక్తులను దోషులుగా తేలుస్తూ తీర్పు చెప్పారు. వీరి శిక్షపై జనవరి 30న విచారణ జరపనున్నారు.

2013 ఏప్రిల్‌ 15న తూర్పు దిల్లీలోని గాంధీనగర్‌ ప్రాంతంలో మనోజ్‌ షా, ప్రదీప్‌ కుమార్‌ చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యంత దారుణంగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత చిన్నారి చనిపోయిందని భావించిన నిందితులు ఆమెను మనోజ్ షా ఇంట్లో వదిలేసి పారిపోయారు. కుమార్తె కన్పించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 40 గంటల తర్వాత ఏప్రిల్‌ 17న బాలికను మనోజ్‌ ఇంట్లో గుర్తించిన పోలీసులు ఆమెను కాపాడారు. 

ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దిల్లీ పోలీసులు మనోజ్‌, ప్రదీప్‌లను బిహార్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి అరెస్టు చేశారు. దాదాపు ఐదేళ్ల తర్వాత న్యాయస్థానంలో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. తాజాగా వీరిద్దరిని దోషులుగా తేలుస్తూ పోస్కో న్యాయస్థానం తీర్పు చెప్పింది. తీర్పుపై బాలిక తండ్రి సంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు తమ కుమార్తెకు న్యాయం జరిగిందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని