
దిల్లీ ఫైట్: 54 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
దిల్లీ: దిల్లీ శాసనసభ ఎన్నికల సమరానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. 54 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ ముఖ్యులైన కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీరథ్‌కు పటేల్‌నగర్ నియోజకవర్గం నుంచి, దిల్లీ మాజీ మంత్రి అరవిందర్ లవ్లీకి గాంధీనగర్ స్థానానికి టికెట్లు కేటాయించినట్లు పార్టీ పేర్కొంది. ఆప్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన అల్కా లంబాకు చాందినీ చౌక్ సీట్‌ను, ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ కీర్తి అజాద్ భార్య పూనమ్ అజాద్‌కు సంగమ్ విహార్ స్థానం నుంచి టికెట్ ఇచ్చినట్లు పార్టీ ప్రకటించింది. ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు పోటీగా న్యూదిల్లీ స్థానంలో ఎవరిని బరిలోకి దింపాలనేది కాంగ్రెస్ ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుత ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు పోటీగా.. లక్ష్మణ్ రావత్‌ను బరిలోకి దించుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 8న దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.