సీఏఏ అమలును రాష్ట్రాలు నిరాకరించలేవు:సిబల్‌

పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) అమలు రాష్ట్రాలు తిరస్కరించే అవకాశమే లేదని ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ స్పష్టం చేశారు. పార్లమెంటులో..........

Updated : 19 Jan 2020 15:49 IST

కోజికోడ్‌: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును రాష్ట్రాలు నిరాకరించే అవకాశమే లేదని ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ స్పష్టం చేశారు. పార్లమెంటులో ఒకసారి చట్టంగా మారిన తర్వాత అమలుచేయాల్సిందేనని.. లేదంటే అది రాజ్యాంగ విరుద్ధ చర్య అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయొచ్చని.. చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి పెంచొచ్చన్నారు. రాష్ట్రాలు చట్టాన్ని అమలు చేయబోమని మొండికేస్తే తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. కేరళలో జరుగుతున్న ‘కేరళ లిటరేచర్‌ ఫెస్టివల్(కేఎల్‌ఎఫ్‌)’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం సీఏఏకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు విద్యార్థులు, పేద, అణగారిన వర్గాల ప్రజలే నేతృత్వం వహిస్తున్నారని కపిల్‌ సిబల్‌ అన్నారు. అందుకే ఈ ఆందోళనలపై ప్రపంచవ్యాప్తంగా స్పందిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీపైనా విమర్శలు గుప్పించారు. ప్రజలు దేశ అభివృద్ధిని కోరకుంటున్నారని.. కానీ, మోదీ ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయడంలేదని ఆరోపించారు. 

సీఏఏని కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కేరళ, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు ఇప్పటికే సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాయి. చట్టాన్ని సవాల్‌ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని