కశ్మీర్‌లో ఇంటర్నెట్ అవి చూసేందుకే కదా!

జమ్ముకశ్మీర్లో ఆర్టికల్‌ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడ ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడాన్ని నీతిఆయోగ్‌ సభ్యుడు, జేఎన్‌యూ ఛాన్సలర్‌ వీకే సరస్వత్‌ సమర్థించుకున్నారు. ఆ ప్రాంతంలో అంతర్జాలాన్ని నిలిపివేయడం వల్ల పెద్దగా నష్టమేమీలేదని ఆయన అన్నారు.  ‘‘ కశ్మీర్లో  ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నప్పుడు, లేనప్పుడు ఏం తేడా కనిపించింది.  అక్కడ ఇంటర్నెట్లో ఏం చూస్తారు...

Published : 20 Jan 2020 00:49 IST

నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సరస్వత్‌

దిల్లీ: జమ్ముకశ్మీర్లో ఆర్టికల్‌ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడ ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడాన్ని నీతిఆయోగ్‌ సభ్యుడు, జేఎన్‌యూ ఛాన్సలర్‌ వీకే సరస్వత్‌ సమర్థించుకున్నారు. ఆ ప్రాంతంలో అంతర్జాలాన్ని నిలిపివేయడం వల్ల పెద్దగా నష్టమేమీలేదని ఆయన అన్నారు.  ‘‘ కశ్మీర్లో  ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నప్పుడు, లేనప్పుడు ఏం తేడా కనిపించింది.  అక్కడ ఇంటర్నెట్లో ఏం చూస్తారు. కేవలం చెత్త సినిమాల కోసమే అక్కడ అంతర్జాలాన్ని వినియోగిస్తారు. అంతకుమించి అక్కడ ఒరిగేదేం లేదు’’ అని సరస్వత్‌ వ్యాఖ్యానించారు.

జమ్ముకశ్మీర్‌లో ఆందోళనలు రేకెత్తించేందుకు రాజకీయనాయకులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారని సరస్వత్‌ అన్నారు. రాజకీయనాయకులు కశ్మీర్‌కు వెళ్లాల్సిన అవసరం ఏముందని అన్నారు. దిల్లీలో ఆందోళనలు చేపట్టినట్లుగానే అక్కడ కూడా చేయాలనుకుంటున్నారని, దీనికి సామాజికమాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారని ఆయన ఓ వార్తా సంస్థతో అన్నారు.

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. అనంతరం శాంతిభద్రతల దృష్ట్యా గత  ఆగస్టు 5 నుంచి ప్రభుత్వం అక్కడ అంతర్జాల సేవలను నిలిపివేసింది. అంతేకాకుండా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. అయితే, పరిస్థితులు అదుపులోకి వస్తుండటంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2జీ ప్రీపెయిడ్‌సేవలను పునరుద్ధరించాలని శనివారం అక్కడి అధికార యంత్రాంగం నిర్ణయించింది. అంతేకాకుండా పోస్ట్‌పెయిడ్‌ కనెక్షన్‌ ఉన్నవారికి ‘‘వైట్ లిస్టెడ్‌’’ వెబ్‌సైట్లను చూసే వీలు కల్పించింది.

సరస్వత్‌ క్షమాపణలు 

తాను చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకత వ్యక్తం కావడంతో వీకే సరస్వత్‌ స్పందించారు. సందర్భానికి మించి మాట్లాడానంటూ క్షమాపణలు చెప్పారు. ‘‘ నేను సందర్భాన్ని మించి మాట్లాడాను. నా మాటలు కశ్మీర్‌ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి. అందువల్ల వారందరికీ క్షమాపణలు చెబుతున్నా. కశ్మీర్‌ ప్రజల అంతర్జాల హక్కులకు వ్యతిరేకంగా మాట్లాడటం నా ఉద్దేశం కాదు’’ అని సరస్వత్‌ అన్నారు.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని