‘కరోనా వైరస్‌’ కథేంటీ..

చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన ‘కరోనా’ వైరస్‌ ప్రాణాంతకంగా మారుతోంది. శ్వాసవ్యవస్థపై పంజా విసిరే ఈ సూక్ష్మజీవి ఇప్పటికే నలుగురిని బలితీసుకోగా.. వైరస్‌ సోకిన వారి సంఖ్య 291 మందికి పెరిగినట్లు అధికారులు తెలిపారు.

Published : 22 Jan 2020 01:53 IST

చైనాను వణికిస్తున్న కొత్త రకం వైరస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన ‘కరోనా’ వైరస్‌ ప్రాణాంతకంగా మారుతోంది. శ్వాసవ్యవస్థపై పంజా విసిరే ఈ సూక్ష్మజీవి ఇప్పటికే నలుగురిని బలితీసుకోగా.. వైరస్‌ సోకిన వారి సంఖ్య 291 మందికి పెరిగినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 900 మందిని వైద్యుల అబ్జర్వేషన్‌లో పెట్టినట్లు చెప్పారు. ఇంతకీ ఈ వైరస్‌ ఏంటీ.. ఎలా వ్యాపిస్తోంది..

కరోనా అంటే..

చైనాలోని ఉహాన్‌లో గల ఓ సముద్రపు ఆహార మార్కెట్‌ కేంద్రంగా కొత్త వైరస్‌ వ్యాపించినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. వైరస్‌ కారణంగా ఉహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వెంటనే వీరి శాంపిల్స్‌ను లండన్‌ను పంపించి పరిశోధనలు చేపట్టారు. అక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి ఈ వైరస్‌ను ‘కరోనావైరస్‌’గా గుర్తించారు. లాటిన్‌ పదం కరోనా(అంటే కిరీటం అని అర్థం) నుంచి ఈ పేరు వచ్చింది. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు రాజులు ధరించే కిరీటం ఆకృతిలో కన్పించడంతో దీనికి ఈ పేరు పెట్టారు.  

శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960ల్లో తొలిసారిగా కనుగొన్నారు. కరోనా వైరస్‌లు ఓ విస్తృత కుటుంబానికి చెందినవి. పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటిలో చాలా రకాలున్నాయి. అయితే ఇందులో కేవలం ఆరు రకాల వైరస్‌లు మాత్రమే ఇప్పటివరకు మనుషులపై ప్రభావం చూపించాయి. అవి.. 
1. హ్యూమన్‌ కరోనావైరస్‌ 229ఈ
2. హ్యూమన్‌ కరోనావైరస్‌ ఓసీ43
3. సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌(సార్స్‌-సీఓవీ)
4. హ్యూమన్‌ కరోనావైరస్‌ ఎన్‌ఎల్‌63
5. హ్యూమన్‌ కరోనావైరస్‌ హెచ్‌కేయూ1
6. మిడిల్‌ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనావైరస్‌(మెర్స్‌-సీఓవీ)

తాజాగా ఉహాన్‌లో పుట్టుకొచ్చిన కొత్త నోవెల్‌ కరోనావైరస్‌తో వీటి సంఖ్య ఏడుకు పెరిగినట్లయింది. గతంలో సార్స్‌, మెర్స్‌ వైరస్‌లు కూడా చైనాలో విజృంభించి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 

వైరస్‌ లక్షణాలేంటీ..

ఈ వైరస్‌ సోకిన వారికి తొలుత జలుబు వస్తుంది. ఆ తర్వాత జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చలికాలంలో ఈ వైరస్‌ తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. 

మనుషుల నుంచి మనుషులకు కూడానా..?

చైనాలోని ఉహాన్‌ సముద్ర ఆహార మార్కెట్‌లో ఈ వైరస్‌ను గత డిసెంబరులో గుర్తించారు. జంతువుల నుంచి మనుషులకు ఇది సోకినట్లు భావిస్తున్నారు. అయితే మనుషుల నుంచి మనుషులకు కూడా వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని చైనా ప్రభుత్వ నిపుణుడు జాంగ్‌ నన్షాన్‌ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. మనుషుల నుంచి సోకే దాఖలాలేవీ లేవని అధికారులు స్పష్టం చేశారు. 

ఇతర దేశాల్లోనూ వైరస్‌ ప్రభావం.. 

 బీజింగ్‌, షాంఘై, దక్షిణ గాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోనూ 20మందికి పైగా ఈ వైరస్‌ బారినపడ్డారు. అంతేగాక, దక్షిణకొరియా, జపాన్‌, థాయ్‌లాండ్‌లోనూ ఈ వ్యాధి కేసులు నమోదయ్యాయి. దేశం వెలుపల కేసులు నమోదయ్యాయంటే చైనాలో ఇంకెంతమందికి ఈ వైరస్‌ సోకి ఉంటుందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

అప్రమత్తమైన భారత్‌..

మరోవైపు కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. చైనా ముఖ్యంగా ఉహాన్‌ నుంచి తమ దేశానికి వస్తున్న పర్యాటకులకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, దక్షిణకొరియా దేశాలు విమానాశ్రయాల్లోనే హెల్త్‌ చెకప్‌లు చేస్తున్నారు. భారత్‌ కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికుల కోసం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అప్రమత్తమై ఈ వైరస్‌పై అత్యవసరంగా సమావేశమైంది.

గతంలో సార్స్‌..  

చైనాలో ఇలాంటి భయంకరమైన వైరస్‌లు పుట్టుకురావడం కొత్తేమీ కాదు. అక్కడి వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణం. గతంలో 2002 నవంబరు నుంచి 2003 జులై మధ్య దక్షిణ చైనాలో కరోనా కుటుంబానికి చెందిన సార్స్‌ వైరస్‌ విజృంభించి ఇతర దేశాలకూ వ్యాపించింది. 37 దేశాల్లో దాదాపు 8000 మంది ఈ వైరస్‌ బారిన పడగా.. 774 మంది ప్రాణాలు కోల్పోయారు. 2004 తర్వాత నుంచి ఒక్క సార్స్‌ కేసు కూడా నమోదు కాలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని