ట్రంప్‌పై భారీ బహుమానం

సులేమాని హత్యకు ప్రతీకారం చేసిన వారికి భారీ బహుమానం ఇస్తామని ఇరాన్‌ పార్లమెంట్‌ సభ్యుడు ఒకరు ప్రకటించారు.

Published : 22 Jan 2020 12:42 IST

ప్రకటించిన ఇరాన్‌ పార్లమెంటు సభ్యుడు

టెహ్రాన్‌ (ఇరాన్‌): ఐఆర్‌జీసీ ఖుద్స్‌ఫోర్స్‌ మేజర్‌ జనరల్‌ ఖాసిం సులేమాని హత్యకు ఇరాన్‌ ప్రతీకారం తీర్చిన వారికి భారీ బహుమానం ఇస్తామని ఆ దేశ పార్లమెంట్‌ సభ్యుడు ఒకరు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను చంపిన వారికి మూడు మిలియన్‌ డాలర్ల బహుమానం ఇస్తానని అహ్మద్‌ హమ్జే అనే పార్లమెంటు సభ్యుడు ప్రకటించాడు. జనవరి 3వ తేదీన బాగ్దాద్‌ విమానాశ్రయం వద్ద అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో సులేమానీ చనిపోయిన సంగతి తెలిసిందే.
ఇరాన్‌లో సులేమాని స్వస్థలమైన కెర్మాన్‌ గ్రామం ఉన్న కహ్నౌజ్‌ ప్రాంతానికి అహ్మద్‌ హమ్జే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ‘‘సులేమాని మృతికి ప్రతీకారంగా ట్రంప్‌ను చంపిన వారికి మూడు మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు ఇస్తాం...’’ అని కెర్మాన్‌ ప్రజల సమక్షంలో హమ్జే ప్రకటించారు. ఇది అర్థంలేని ప్రకటన అని అమెరికా ప్రతినిధి రాబర్ట్‌వుడ్‌ ఖండించారు. ఇరాన్ ప్రాంతంలో పాతుకుపోయిన ఉగ్రవాదాన్ని ఈ ప్రకటన తెలియజేస్తోందన్నారు. అక్కడి వారు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని రాబర్ట్‌వుడ్‌  హితవు పలికారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని