ఔరా..! టూత్‌పిక్స్‌తో జాతీయ జెండా

ఆయనో పాఠశాల ఉపాధ్యాయుడు.. గణతంత్ర వేడుకల్లో అందరి ఉపాధ్యాయుల్లా పాఠశాలలో జరిగే వేడుకలకే పరిమితం కాదలచుకోలేదు. తన దేశభక్తిని వినూత్నంగా.........

Updated : 24 Jan 2020 19:46 IST

ఓ ఉపాధ్యాయుడి వినూత్న కృషికి నెటిజన్ల సెల్యూట్‌ 

అమృత్‌సర్‌: ఆయనో పాఠశాల ఉపాధ్యాయుడు.. గణతంత్ర వేడుకల్లో అందరి ఉపాధ్యాయుల్లా పాఠశాలలో జరిగే వేడుకలకే పరిమితం కాదలచుకోలేదు. తన దేశభక్తిని వినూత్నంగా చాటాలనుకున్నారు. అందరిలో ఒక్కడిలా కాకుండా విభిన్నంగా ఏదో ఒకటి చేసి తానేంటో నిరూపించుకోవాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే టూత్‌పిక్స్‌తో జాతీయ జెండాను రూపొందించి ఔరా అనిపించారు. ఆయనే పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన ఉపాధ్యాయుడు బల్జీందర్‌ సింగ్‌. ఈ నెల 26న భారత గణతంత్ర వేడుకలు జరగనున్న వేళ టూత్‌పిక్స్‌తో మువ్వన్నెల జెండాను రూపొందించారు. దీనికోసం ఆయన ఏకంగా 40 రోజుల పాటు శ్రమించి 71వేల టూత్‌పిక్స్‌తో మూడు రంగుల ముచ్చటైన జెండాను రూపొందించి అందరి మన్ననలూ అందుకుంటున్నారు. 

ఈ జెండా రూపొందించడంపై బల్జీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలం క్రితం నాకో ఆలోచన వచ్చింది. ఇంతకమునుపెన్నడూ ఎవరూ చేయని విధంగా చేయాలని భావించాను. అలా వచ్చిందే టూత్‌పిక్స్‌తో జాతీయ జెండా రూపకల్పన ఆలోచన. ఇదే పొడవైన జెండా కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఇది పూర్తిచేసేందుకు నాకు 40 రోజుల సమయం పట్టింది. జిల్లా స్థాయిలో జరిగే గణతంత్ర వేడుకల సందర్భంగా దీన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నం చేస్తున్నా’’ అని వివరించారు. మరోవైపు, జాతీయ జెండా తయారు చేయడంలో ఈ ఉపాధ్యాయుడు చేసిన కృషికి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘అద్భుతంగా ఉంది.. మీ దేశభక్తికి సెల్యూట్‌.. బాగా చేశారు సోదరా. .’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని