అమెరికా రాయబార కార్యాలయంపై రాకెట్‌ దాడి

ఇరాక్‌లో మరోసారి రాకెట్‌ దాడులు జరిగినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇరాక్‌ రాజధాని బగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో ఆదివారం రాత్రి రాకెట్‌ దాడులు చోటుచేసుకున్నట్లు భద్రతా వర్గాలు  తెలిపాయి. గ్రీన్‌జోన్‌ ప్రాంతంలో ఉన్న

Updated : 27 Jan 2020 08:27 IST

బగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఆదివారం సాయంత్రం రాకెట్‌ దాడి జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అటు ఇరాక్‌ భద్రతా బలగాలు, ఇటు అమెరికా వర్గాలు ప్రకటించాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తర్వాత అమెరికా రాయబార కార్యాలయంపై నేరుగా రాకెట్‌ దాడి జరగడం ఇదే తొలిసారి. తాజా దాడిలో మొత్తం ఐదు రాకెట్లు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో రాయబార కార్యాలయం ప్రహరీ గోడ, క్యాంటీన్‌ ధ్వంసమైనట్లు సమాచారం. సులేమానీ మృతి తర్వాత దాడి-ప్రతిదాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి దాడి జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పలుసార్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తాజా దాడి నేరుగా రాయబార కార్యాలయంపైనే జరగడం పరిస్థితుల్ని మరింత దిగజార్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. 

తాజా దాడిని ఇరాక్‌ ప్రధాని అదిల్‌ అబ్దెల్‌ మహ్దీ, స్పీకర్‌ మొహమ్మద్‌ హల్‌బుసి తీవ్రంగా ఖండించారు. తమ భూభాగాన్ని యుద్ధ భూమిగా మారుస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఈ దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు. అయినప్పటికీ.. ఇరాక్‌లో ఇరాన్‌ మద్దతున్న తీవ్రవాద సంస్థల పనేనని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా బలగాలు తమ భూభాగం నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల ఇరాక్‌లో భారీ స్థాయిలో పౌరులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ తరుణంలో దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని