
డబ్బుల్లేకే ఎయిరిండియా విక్రయం
దిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా 100 శాతం వాటాను వేలం వేయడంపై భాజపా ఎం సుబ్రహ్మణ్య స్వామితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్లే కేంద్రం ఇటువంటి చర్యలు చేస్తుందని ఆయన ఆరోపించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎయిరిండియా వేలంపై స్పందించారు.
‘ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఇటువంటి చర్యలకు దిగుతారు. కేంద్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు, వృద్ధి రేటు 5శాతం కంటే తగ్గువగా ఉంది. ఎంఎన్ఆర్ఈజీఏ పేరిట కొన్ని కోట్ల బాకీలు ఉన్నాయి. అందుకే వాళ్లు ఇలా చేస్తున్నారు. మనకున్న విలువైన ఆస్తులను విక్రయిస్తున్నారు’ అని కపిల్ సిబాల్ మండిపడ్డారు.
కోర్టును ఆశ్రయిస్తా..
ఇక భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియ నేడు మళ్లీ ప్రారంభించారు. ఇది పూర్తిగా జాతి వ్యతిరేకం. దీనిపై నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. దీన్ని అమ్మేందుకు మేం ఒప్పుకోం’ అని ఆయన ట్వీట్ చేశారు. ఎయిరిండియా నష్టాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో దానికి ఊతమివ్వకుండా ఎందుకు విక్రయిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎయిరిండియాలో 100శాతం వాటాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన బిడ్డింగులను ఆహ్వానించింది. ఆసక్తి కలిగిన వాళ్లు మార్చి 17లోపు బిడ్డింగ్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది.