కరోనాపై పోరుకు చైనా ప్రయత్నాలు

చైనాలో ఉనికిలోకి వచ్చిన కరోనా వైరస్‌ అంతకంతకూ విజృంభిస్తోంది. దీనిపై పోరాటం చేసేందుకు ఇప్పటికే చైనా ఆర్థిక శాఖ 1బిలియన్‌ డాలర్లు ప్రకటించినప్పటికీ.. వైరస్‌ ఇంకా వేగంగా వ్యాప్తి జరుగుతుండటంతో దానిపై పోరాటాన్ని 9 బిలియన్‌ డాలర్లకు పెంచింది.

Published : 28 Jan 2020 01:33 IST

బీజింగ్‌: చైనాలో ఉనికిలోకి వచ్చిన కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీనిపై పోరాటం చేసేందుకు ఇప్పటికే చైనా ఆర్థిక శాఖ 1 బిలియన్‌ డాలర్లు ప్రకటించినప్పటికీ.. వైరస్‌ తీవ్రత కారణంగా ఆ మొత్తాన్ని 9 బిలియన్‌ డాలర్లకు పెంచింది. ఈ మేరకు ఆ దేశ ఆర్థిక శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఇప్పటివరకు చైనాలో ఈ వైరస్‌ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 80కి చేరింది. మరో 2,744 మందిలో వైరస్‌ లక్షణాలు గుర్తించినట్లు చైనా ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. వారిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు టిబెట్‌కు చెందిన ఆధ్యాత్మిక గురువు దలైలామా అధికారిక నివాసమైన పొటాలా ప్యాలెస్‌ను సైతం సోమవారం మూసివేశారు. చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా రక్షణ చర్యల్లో భాగంగా మూసేసినట్లు సమాచారం. మళ్లీ తదుపరి నోటీసులు వచ్చే వరకు తెరిచేందుకు వీలు లేదని తెలుస్తోంది. 

భారత్‌లోనూ వైరస్‌ కలకలం
చైనా నుంచి ఇటీవలే భారత్‌కు తిరిగి వచ్చిన ఒక బిహార్‌ యువతి కరోనా వైరస్‌ లక్షణాలతో ఆసుపత్రిలో చేరింది. 29 సంవత్సరాల ఈమె చైనాలో పీహెచ్‌డీ విద్యార్థిని. జనవరి 22న చైనా నుంచి కోల్‌కతాకు చేరిన ఈ విద్యార్థిని, ఆ తరువాతి రోజు బిహార్‌లోని తన స్వగ్రామానికి చేరుకుంది. రెండు రోజుల అనంతరం దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్టు చెప్పింది. ఈ విషయాన్ని పుణెలోని ఆమె సోదరి వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు హెల్ప్‌లైన్‌ ద్వారా తెలియజేసినట్లు సమాచారం.

విమానాశ్రయాల్లోనే పరీక్షలు..
మరోవైపు చైనా నుంచి తిరిగి వచ్చిన ఓ రాజస్థాన్‌ వైద్యుడికి కూడా ఈ వైరస్‌ సోకిందని అనుమానిస్తున్నారు. ఆయన రక్తనమూనాలను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. కేరళ, మహారాష్ట్రల్లో 100 మందికి పైగా కరోనా అనుమానితులను వైద్య పర్యవేక్షణలో ఉంచారు. విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 137 విమానాల్లో దేశానికి తిరిగి వచ్చిన 29,700 మంది ప్రయాణికులకు కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ వైరస్‌ విషయమై ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పటికే సమీక్ష నిర్వహించింది.

ఇదీ చదవండి..

కరోనా వైరస్‌ కథేంటి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని