ఎయిరిండియా ఉద్యోగుల పరిస్థితేంటి?

ముంబయి: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రభుత్వం సరైన మార్గంలో ఎందుకు నడిపించలేకపోతోందని శివసేన అధికారిక పత్రిక సామ్నా ప్రశ్నించింది. ఎయిరిండియాలో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణపై సామ్నా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి

Published : 28 Jan 2020 11:56 IST

ముంబయి: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రభుత్వం సరైన మార్గంలో ఎందుకు నడిపించలేకపోతోందని శివసేన అధికారిక పత్రిక సామ్నా ప్రశ్నించింది. ఎయిరిండియాలో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణపై సామ్నా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది.

‘భారత్‌కు ఒకప్పుడు ఎయిరిండియా గర్వకారణంగా నిలిచింది. అందుకే దాన్ని మహారాజ అని పిలిచేవాళ్లు. కానీ గత రెండు దశాబ్దాల నుంచి ఎయిరిండియా తీవ్ర రుణభారంతో సతమతమవుతోంది. రుణాలు కోట్లకు కోట్లు పేరుకుపోయాయి. గతంలో 70-80శాతం వాటాను విక్రయించాలని భావించారు. కానీ ఇప్పుడు ఏకంగా ఎయిరిండియా మొత్తాన్ని అమ్మేయాలని నిర్ణయించారు. ఏప్రిల్‌లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇతర విమానసంస్థలు మనుగడ సాగించినట్లుగానే ఎయిరిండియా ఎందుకు సాధించలేకపోయింది? ఎయిరిండియా వంటి కంపెనీలను ప్రభుత్వం ఎందుకని సరైన మార్గంలో నడిపించలేకపోతుంది? ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రైవేటీకరణనే ఎందుకు ఎంచుకుంటున్నారు’? అని సామ్నా తన కథనం ద్వారా కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. 

‘ఎయిరిండియాలో పని చేస్తున్న వేల మంది ఉద్యోగుల భవిష్యత్‌ ఏమిటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వాళ్లు బాధపడకూడదు. జెట్‌ఎయిర్‌వేస్‌లో ఏం జరిగిందనేది అందరికీ తెలుసు, అది ఎయిరిండియాలో జరగకూడదు. ఉద్యోగులు నిరుద్యోగులుగా మారకూడదు. ఎయిరిండియాను పూర్తిగా అమ్మినప్పటికీ దాని గొప్పదనం ఏమాత్రం తగ్గదు, దాన్ని ఎవరూ మర్చిపోలేరు’ అని సామ్నా పేర్కొంది. ఎయిరిండియాను 100% ప్రైవేటీకరణ చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాలో 100శాతం వాటాలను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు కేంద్రం నిన్న ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని