ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన షార్జిల్‌

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన జేఎన్‌యూ పీహెచ్‌డీ విద్యార్థి షార్జిల్‌ ఇమామ్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. షార్జిల కోసం గత నాలుగు రోజులుగా గాలింపు చేపట్టిన దిల్లీ

Updated : 28 Jan 2020 20:26 IST

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన జేఎన్‌యూ పీహెచ్‌డీ విద్యార్థి షార్జిల్‌ ఇమామ్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. షార్జిల కోసం గత నాలుగు రోజులుగా గాలింపు చేపట్టిన దిల్లీ పోలీసులు.. బిహార్‌లోని జెహనాబాద్‌ ప్రాంతంలో మంగళవారం అరెస్టు చేశారు. 

సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న షార్జిల్‌.. అసోం, ఈశాన్య రాష్ట్రాలను భారత్‌ నుంచి వేరు చేయాలంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవడంతో దిల్లీ పోలీసులు అతడిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. అసోం, ఉత్తర్‌ప్రదేశ్‌, మణిపూర్‌, బిహార్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోనూ అతడిపై కేసులు నమోదయ్యాయి.

అయితే ఈ వీడియో వెలుగులోకి వచ్చిన నాటి నుంచి షార్జిల్‌ కనబడకుండా పోయాడు. దీంతో అతడి కోసం దిల్లీ క్రైం బ్రాంచ్‌ ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేసింది. రాజధానితో పాటు ముంబయి, పట్నా ప్రాంతాల్లోనూ గాలించింది. మరోవైపు అతడి కుటుంబసభ్యులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరిపింది. ఎట్టకేలకు నేడు తన సొంత పట్టణమైన జెహనాబాద్‌ నుంచి షార్జిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. దిల్లీలో ఉద్రిక్తంగా జరుగుతున్న షహీన్‌బాగ్‌ ధర్నాకు షార్జిల్‌ కూడా ఒక నిర్వాహకుడని ఆరోపణలున్నాయి. అయితే షార్జిల్‌ వ్యాఖ్యలకు షహీన్‌బాగ్‌ నిరసనకారులు దూరంగా ఉన్నారు. అంతేగాక, ఈ ఆందోళనకు ఏ ఒక్కరు కూడా నిర్వాహకుడిగా ఉండరని తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని