దిల్లీ ఎన్నికల్లో భాజపాకు అకాలీదళ్‌ మద్దతు

దేశ రాజధానిలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) తమకు మద్దతు తెలుపుతుందని భాజపా ప్రకటించింది. ఈ మేరకు బుధవారంనాడు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా...

Updated : 30 Jan 2020 09:21 IST

దిల్లీ: దేశ రాజధానిలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) తమకు మద్దతు ప్రకటించిందని భాజపా తెలిపింది. బుధవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎస్‌ఏడీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్ బాదల్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం ఇరు పార్టీల నేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తొలగిపోయాయని, దిల్లీ ఎన్నికల్లో భాజపాకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు భేటీ అనంతరం సుఖ్‌బీర్ పేర్కొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తమకు మద్దతు తెలుపుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

‘‘శిరోమణి అకాలీదళ్ దిల్లీ శాసనసభ ఎన్నికల్లో భాజపాకు మద్దతు తెలపాలని తీసుకొన్న నిర్ణయానికి సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌కు ధన్యవాదాలు. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ (నేషనల్ డెమోక్రటిక్‌ అలయన్స్‌) భాగస్వామ్య పక్షాలలో ఎస్‌ఏడీ ముఖ్యమైనది. ప్రజలకు సేవచేయడంలో ఆ పార్టీ ఎప్పుడూ ముందుంటుది. మా రెండు పార్టీల మధ్య భాగస్వామ్యం ఎప్పటికీ బలంగానే ఉంటుంది’’ అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఈ సమావేశానికి ముందు సుఖ్‌బీర్‌ నివాసానికి చేరుకొన్న నడ్డాకు సాదర స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఎస్‌ఏడీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్ బాదల్ మాట్లాడుతూ ‘‘జాతీయ ప్రయోజనాలతోపాటు, దేశ వ్యాప్తంగా ఉన్న సిక్కు ప్రజల కోసం రెండు పార్టీలు కూటమిగా ఏర్పడినట్లు తెలిపారు. రాబోయే దిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ కార్యకర్తలు భాజపాతో కలిసి పనిచేస్తారని వెల్లడించారు. భాజపాతో తమ పార్టీ ఎప్పడూ తెగతెంపులు చేసుకోలేదని, కేవలం ఎన్నికల్లో కలిసి పోటీచేయకూడదని మాత్రమే నిర్ణయించుకున్నామని’’ అన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం, సీట్ల పంపకాల విషయంలో భాజపా, ఎస్‌ఏడీ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో తాము ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఇటీవల ఎస్‌ఏడీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో కొంత ఆందోళనకు గురైన భాజపా.. దిల్లీలో కొన్ని స్థానాల్లో సిక్కు ఓటర్లు తమకు దూరమవుతారని భావించి ఎస్‌ఏడీతో చర్చలు జరిపి ఆ పార్టీ మద్దతు కూడగట్టడంలో సఫలీకృతమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని