
ఉరికి ఒక్కరోజుముందు..సుప్రీంకు నిర్భయ దోషి
దిల్లీ: సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను ఉరి తీయడానికి ఇంకా ఒక్కరోజే గడువు.. ఓవైపు తీహాడ్ జైల్లో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు శిక్ష అమలును వాయిదా వేసేందుకు దోషుల ప్రయత్నాలూ కొనసాగుతూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో శుక్రవారం (ఉరికి ఒక్కరోజు ముందు) సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్ అని వేసిన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు.
నిర్భయ హత్యచార ఘటన సమయంలో తాను మైనర్ అని, దాని ఆధారంగానే విచారణ జరపాలని కోరుతూ పవన్ గుప్తా ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ పవన్ గుప్తా నేడు రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ సందర్భంగా ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరాడు. దిల్లీ కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ ప్రకారం శనివారం ఉదయం 6 గంటలకు దోషులను ఉరితీయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో శిక్ష అమలును వాయిదా వేయించేందుకు దోషులు అనేక యత్నాలు చేస్తుండటం గమనార్హం.
స్టేపై మొదలైన విచారణ
ఇదిలా ఉండగా.. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ దోషులు వేసిన పిటిషన్‌పై దిల్లీ పాటియాలా కోర్టు నేడు విచారణ ప్రారంభించింది. దోషులందరూ అన్ని న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునేవరకు ఉరిశిక్ష అమలు చేయవద్దని కోరుతూ దిల్లీ కోర్టులో నిన్న పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాల్సిందిగా తీహాడ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. అయితే శిక్షను ఆలస్యం చేసేందుకే దోషులు ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని, చట్టాన్ని అవహేళన చేస్తున్నారని ప్రాసిక్యూషన్ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.