రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్‌ నిరసన

రాష్ట్రపతి రామ్‌కోవింద్‌ ప్రసంగం సందర్భంగా పార్లమెంటులో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రసంగంలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు(సీఏఏ)ని ప్రశంసించడం.........

Updated : 31 Jan 2020 14:58 IST

దిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం సందర్భంగా పార్లమెంటులో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రసంగంలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు(సీఏఏ)ని ప్రశంసించడం పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎంపీలు నినాదాలు చేశారు. నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఎన్ఆర్‌సీ, ఎన్‌ఆర్‌పీ, సీఏఏని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఆందోళనలో రాహుల్‌ గాంధీ, గులాం నబీ ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌, అధిర్‌ రంజన్ చౌధురి, ఏకే ఆంటోని తదితరులు పాల్గొన్నారు. 

పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి.. అధికరణ 370 రద్దుని చరిత్రాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించారు. సీఏఏని సైతం చరిత్రాత్మక చట్టంగా అభివర్ణించిన ఆయన.. దీంతో మహాత్మా గాంధీ కలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. పాక్‌లో నివసించడం ఇష్టం లేని హిందువులు భారత్‌ రావాల్సిందిగా మహాత్మాగాంధీ చెప్పారని గుర్తుచేశారు. ఆందోళనల పేరుతో హింసకు పాల్పడితే అది దేశాన్ని బలహీనం చేస్తుందని అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని