నిర్భయ కేసులో ట్విస్ట్‌: ముగ్గుర్నే ఉరితీస్తారా?

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ దోషులు నలుగురు నిన్న దిల్లీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Published : 31 Jan 2020 13:41 IST

‘ఉరి’పై స్టే పిటిషన్లపై తీర్పు రిజర్వ్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ దోషులు నలుగురు నిన్న దిల్లీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే వీరి అభ్యర్థనను తీహాడ్‌ జైలు అధికారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఒక దోషి క్షమాభిక్ష అభ్యర్థన మాత్రమే పెండింగ్‌లో ఉందని, అతడు మినహా మిగతా ముగ్గుర్ని రేపు ఉరితీసేందుకు అవకాశం ఉందని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. 

దిల్లీ కోర్టు జారీ చేసిన డెత్‌ వారెంట్‌ ప్రకారం శనివారం ఉదయం 6 గంటలకు నలుగురు దోషుల్ని ఉరితీయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో మరో దోషి వినయ్‌ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. దీంతో ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ గురువారం పాటియాలా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ సింగ్‌ వాదిస్తూ..  దోషులేమీ ఉగ్రవాదులు కాదని అన్నారు. దోషులందరూ అన్ని న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునే వరకు శిక్ష అమలుపై స్టే విధించాలని కోరారు. అంతవరకు ఈ కేసును నిరవధికంగా వాయిదా వేయాలని అభ్యర్థించారు.  

అయితే, దోషుల పిటిషన్‌ను జైలు అధికారులు వ్యతిరేకించారు. ప్రస్తుతం ఒక్క దోషి పిటిషన్‌ మాత్రమే పెండింగ్‌లో ఉందని, మిగతా ముగ్గుర్నీ ఉరితీసేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు న్యాయస్థానానికి వివరించారు. అయితే దీనిపై దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ విభేదించారు. జైలు నిబంధనల ప్రకారం.. ఒక కేసులో ఎక్కువ మంది దోషులు ఉన్నప్పుడు ఒక్క దోషి అభ్యర్థన పెండింగ్‌లో ఉన్నా.. మిగతా వారిని ఉరితీయడం సాధ్యం కాదని గుర్తుచేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ సాయంత్రం తీర్పును వెల్లడించనుంది.

మరోవైపు నిర్భయ కేసు విచారణ సమయంలో తాను మైనర్‌నంటూ పిటిషన్‌ వేసిన దోషి పవన్‌ గుప్తా.. నేడు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మైనర్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాడు. తాజా పరిణామాల నేపథ్యంలో రేపటి ఉరితీతపై సందిగ్ధత నెలకొంది. జైలు అధికారులు చెప్పినట్లు ముగ్గురు దోషులను ఉరితీస్తారా.. లేదా శిక్ష అమలు వాయిదా పడుతుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. 

ఇదీ చదవండి: ఉరికి ఒక్కరోజు ముందు సుప్రీంకు నిర్భయ దోషి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని