కంటతడి పెట్టిన నిర్భయ తల్లి 

నిర్భయ హత్యాచార దోషులకు ఉరిశిక్ష అమలును మరోసారి వాయిదా వేస్తూ పటియాలా న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై నిర్భయ తల్లి కన్నీరుమున్నీరయ్యారు. దోషులకు ఎప్పటికీ......

Updated : 31 Jan 2020 21:52 IST

ఆ లాయర్‌ సవాల్‌ విసిరాడు

దిల్లీ: నిర్భయ హత్యాచార దోషులకు ఉరిశిక్ష అమలును మరోసారి వాయిదా వేస్తూ పటియాలా న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై నిర్భయ తల్లి కన్నీరుమున్నీరయ్యారు. దోషులకు ఎప్పటికీ ఉరిశిక్ష పడదంటూ వారి తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ సవాల్‌ విసిరాడన్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు దోషులకు ఉరిశిక్ష అమలు చేయొద్దంటూ ఇచ్చిన ఆదేశాలపై ఆమె అసహనం వ్యక్తంచేశారు. దోషులకు ఉరిశిక్ష పడేదాకా తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టంచేశారు. దోషులను ఉరితీయాలని  ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏడేళ్లుగా తాను పోరాటం చేస్తున్నా దోషులు ఏం కోరుకుంటున్నారో అదే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

దోషులకు ఉరిశిక్ష అమలు చేసేవరకు తన పోరాటం ఆగదని నిర్భయ తల్లి స్పష్టం చేశారు. ఉరిశిక్ష అమలును జాప్యం చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడం వారికి ఇష్టం లేదని విమర్శించారు.  దోషులకు శిక్ష పడనప్పుడు మనకున్న ఈ చట్టాలు, వ్యవస్థలు ఎందుకని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నలుగురు దోషులకు జీవించే హక్కు లేదని, వారికి ఉరిశిక్ష పడే వరకు తన పోరాటం ఆగదని ఆమె ఉద్ఘాటించారు.

అంతసేపు ఎందుకు కూర్చోబెట్టారు?
దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు ఇస్తారనే ఉద్దేశంతో ఉదయం 10 గంటల నుంచి ఇక్కడే కూర్చున్నానని నిర్భయ తల్లి మీడియాతో చెప్పారు. వారిని విడిచిపెట్టే ఉద్దేశమే ఉంటే.. అంతసేపు తనను ఎందుకు కోర్టు ఆవరణలో కూర్చోబెట్టారని ప్రశ్నించారు. దోషులకు ఉరిశిక్ష వేస్తారని ఆశలు రేకెత్తించే బదులు.. తనను ఇంటికి పంపేయొచ్చు కదా?అని ఆమె విలేకరులతో అన్నారు.

గతంలో కోర్టు జారీ చేసిన డెత్‌ వారెంట్‌ ప్రకారం రేపు (శనివారం) ఉదయం 6గంటలకే ఉరితీయాల్సి ఉంది. అయితే, దోషులు తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అదనపు సెషన్స్‌ జడ్జి  జస్టిస్‌ ధర్మేందర్‌ రాణా ఉరిశిక్ష అమలుపై స్టే విధించారు. దోషులకు డెత్‌ వారెంట్‌పై స్టే ఇవ్వడం ఇది రెండోసారి. వాస్తవానికి జనవరి 22నే నిర్భయ దోషులకు ఉరితీయాల్సి ఉండగా తొలిసారి స్టే విధించారు. దీంతో ఫిబ్రవరి 1న ఉరితీయాలని డెత్‌ వారెంట్‌ జారీ చేయగా తాజాగా రెండోసారి స్టే విధించడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని