వామ్మో చైనా వాళ్లా..!

చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా ఆదేశంపై అంతర్జాతీయంగా విద్వేషం పెరిగేలా చేస్తోంది. ఆ విష మహమ్మారి ఇతర దేశాలకూ వ్యాపిస్తుండటమే విద్వేషానికి కారణం. పలు దేశాల్లో చైనీయులకు వ్యతిరేకంగా జాతి వివక్ష జ్వాలలు ఎగసిపడుతున్నాయి.

Published : 03 Feb 2020 01:26 IST

కరోనాతో చైనీయులపై రగులుతున్న విద్వేషం

సియోల్‌: చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ఆదేశంపై అంతర్జాతీయంగా విద్వేషం పెరిగేలా చేస్తోంది. ఆ విష మహమ్మారి ఇతర దేశాలకూ వేగంగా వ్యాపిస్తుండటమే విద్వేషానికి కారణం. పలు దేశాల్లో చైనీయులకు వ్యతిరేకంగా వివక్ష జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఆ దేశస్థుల పర్యటనలు నిషేధించడం, వారిని రెస్టరెంట్లలోకి రానివ్వకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. చైనీయులు మాత్రమే కాకుండా పలు ఆసియా ప్రాంతాలకు చెందిన వారిపైనా ఈ ప్రభావం పడుతుండటం గమనార్హం. ఇప్పటికే దక్షిణ కొరియా, జపాన్‌, హాంగ్‌కాంగ్‌, వియత్నాంలోని రెస్టరెంట్లు చైనీస్‌ కస్టమర్లను నిరాకరిస్తున్నారు. మరోవైపు ఐరోపా, యూఎస్‌లోనూ చైనా సహా ఇతర ఆసియా దేశాల వారు కరోనా కారణంగా వివక్షను ఎదుర్కొంటున్నారు. 

చైనీయులకు వ్యతిరేకంగా 6లక్షల మంది

చైనీయుల ఆహారపు అలవాట్ల గురించి ప్రచారం చేస్తున్న వ్యాఖ్యలను నివారించాలని పలువురు చైనీయులు దక్షిణకొరియా ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. అదేవిధంగా సియోల్‌లోని ప్రముఖ సీఫుడ్‌ రెస్టరెంట్‌ చైనీయులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. చైనా పర్యాటకులను నిరాకరించాలని 6లక్షల మంది దక్షిణకొరియా పౌరులు ప్రభుత్వానికి దరఖాస్తు చేయడం గమనార్హం. దాదాపు 30 మంది అందుకు నిరసనగా బ్లూహౌజ్‌ వద్ద బుధవారం ర్యాలీ ప్రదర్శన సైతం నిర్వహించారు. 

పలు చోట్ల ఆహారానికీ నిరాకరణ

హాంకాంగ్‌లో పలు హోటళ్లలో చైనీయులకు ఆహారం సరఫరా చేసేందుకు నిరాకరిస్తున్నారు. ‘మేము ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నాం. స్థానిక కస్టమర్ల కోసం మిమ్మల్ని నిరాకరిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. డానిష్‌కు చెందిన మరో వార్తా పత్రిక చైనా జాతీయ పతాకంలోని చుక్కలతో వైరస్‌ కార్టూన్‌ను ప్రచురించింది. దీనిపై చైనా దౌత్య కార్యాలయం స్పందిస్తూ.. తమ దేశాన్ని కించపరచడం తగదని క్షమాపణలు చెప్పాలని కోరింది. ఇలా పలు చోట్ల వారిపై వివక్ష రేకెత్తుతుండటం వారి దయనీయ పరిస్థితిని స్పష్టం చేస్తోంది. 

చైనాలో కాకుండా దాదాపు 24 దేశాల్లో కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఫిలిప్పీన్స్‌లో మాత్రం ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దీని ధాటికి చైనాలో మొత్తం 304 మంది మరణించగా.. వేలాది మంది దీని బారిన పడ్డారు. చాలా దేశాలు వుహాన్‌కు ప్రత్యేక విమానాలు పంపించి అక్కడి నుంచి తమ దేశాలకు చెందిన వారి వెనక్కి రప్పించుకుంటున్నాయి. అంతేకాకుండా ఈ పరిణామాలు చైనాకు వాణిజ్య, రాజకీయ, దౌత్య పరంగా వివాదాలుగా మారుతున్నాయి. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని