షేక్‌హ్యాండ్‌ ఇవ్వని ట్రంప్‌: పేపర్లు చించిన నాన్సీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ మధ్య విభేదాలు తెలియనివి కావు. అనేకసార్లు వీరు బహిరంగంగానే మాటల కత్తులు దూసుకున్నారు. తాజాగా వీరి మధ్య ప్రచ్ఛనయుద్ధం మరోసారి బయటపడింది.

Updated : 08 Dec 2022 13:00 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ మధ్య విభేదాలు తెలియనివి కావు. అనేకసార్లు వీరు బహిరంగంగానే మాటల కత్తులు దూసుకున్నారు. తాజాగా వీరి మధ్య ప్రచ్ఛనయుద్ధం మరోసారి బయటపడింది. తన వార్షిక ప్రసంగం సందర్భంగా నాన్సీ పెలోసీకి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు ట్రంప్‌ నిరాకరించారు. దీంతో నాన్సీ ‘ప్రతీకార చర్య’కు దిగారు. అందరిముందే ట్రంప్‌ ప్రసంగ పత్రాలను ఆమె చించేశారు. 

అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాంగ్రెస్‌ ఉభయ సభలనుద్దేశించి వార్షిక ప్రసంగం చేశారు. అయితే అంతకుముందు తన ప్రసంగం కాపీని ట్రంప్‌ నాన్సీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె అధ్యక్షుడికి షేక్‌హ్యాండ్‌ అందించగా.. ట్రంప్‌ తన చేతిని ఇవ్వకుండానే వెనక్కి తిరిగారు. ఈ పరిణామంతో నాన్సీ ఒకింత అసహనానికి లోనయ్యారు. అయితే ఆ తర్వాత ట్రంప్‌ తన ప్రసంగాన్ని పూర్తి చేస్తుండగా సభలోని వారందరూ చప్పట్లు కొడుతూ అభినందించారు. ఆ సమయంలో నాన్సీ ఉన్నట్టుండి ట్రంప్‌ ప్రసంగం కాపీలను చించేశారు. కాగా.. ట్రంప్‌ ప్రసంగ పత్రాలను ఎందుకు చించేశారని నాన్సీని విలేకరులు అడగ్గా.. ‘ఎందుకంటే ఆయన చేసిన పనికి ప్రత్యామ్నాయంగా ఇదే మర్యాదపూర్వకమైన పని’ అని ఆమె బదులిచ్చారు. 

గతంలోనూ వీరి మధ్య ఇలాంటి సందర్భాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఉభయసభలను ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగం సందర్భంగా నాన్సీ వెటకారంగా చప్పట్లు కొట్టారు. ఇటీవల ట్రంప్‌పై అభిశంసన తీర్మానంపై నాన్సీ వేగంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ ఎదురుపడటం ఇదే తొలిసారి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని