అలాంటి వారిని దేశం నుంచి తరిమేయాల్సిందే!

చైనాలో ఉనికిలోకి వచ్చిన కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను వణికిస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్‌ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా థాయ్‌ ఆరోగ్య శాఖ మంత్రి ఓ నిర్ణయం తీసుకున్నారు. థాయ్‌ల్యాండ్...

Updated : 08 Feb 2020 04:52 IST

థాయ్‌ ఆరోగ్య శాఖ మంత్రి అనుతిన్ చార్న్విరాకుల్

బ్యాంకాక్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రజలను వణికిస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్‌ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా థాయ్‌ ఆరోగ్య శాఖ మంత్రి ఓ నిర్ణయం తీసుకున్నారు. థాయ్‌ల్యాండ్ పర్యటనలో ఉన్న విదేశీయులు ఎవరైనా ముఖానికి మాస్క్‌ ధరించనట్లయితే వారిని క్షమించేది లేదని.. అవసరమైతే దేశం నుంచి తరిమేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో కారణం లేకపోలేదు. స్థానిక బ్యాంకాక్‌ స్కైట్రైన్‌ స్టేషన్‌లో ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అనుతిన్ చార్న్విరాకుల్ పర్యాటకులు, స్థానికులకు స్వయంగా మాస్క్‌లు అందిస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది పర్యాటకులు పట్టించుకోకుండా ముఖానికి ఎలాంటి మాస్కులు ధరించకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం చూసిన మంత్రి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ‘కొంత మంది ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఇతరుల ప్రాణాల పట్ల వారికి ఎలాంటి గౌరవం లేదు. అలాంటి వారిని దేశం నుంచి తరిమేయాల్సిందే’ అని మంత్రి అనుతిన్‌ మీడియాతో చెప్పారు.

ప్రపంచ దేశాల నుంచి థాయ్‌ల్యాండ్ వచ్చే పర్యాటకుల్లో చైనీయులే అత్యధికంగా ఉంటారు. అంతేకాకుండా ఆ దేశ జీడీపీలో 18 శాతం వాటా పర్యాటక రంగానిదే. ఒక ఏడాదిలో థాయ్‌ వచ్చే పర్యాటకుల్లో మూడో వంతు చైనీయులే ఉంటారని అక్కడి ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా కరోనా వైరస్‌ నేపథ్యంలో థాయ్‌ వచ్చే చైనా పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో మొత్తం పర్యాటక రంగంపైనే పెను ప్రభావం పడింది. ఇప్పటివరకు థాయ్‌ల్యాండ్‌లో 25 కరోనా కేసులు నమోదుకాగా వారిలో 9 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ముఖానికి మాస్క్‌ ధరించినవారే కనిపిస్తున్నారు. గత ఏడాది కోటికి పైగా వచ్చిన చైనా పర్యాటకుల సంఖ్య ఈ ఏడాది భారీగా పడిపోయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని