
చైనాలో కొనసాగుతున్న మృత్యుఘోష
బీజింగ్: కరోనా మహమ్మారి చైనాలో ఒక్కరోజులో మరో 88 మంది ప్రాణాల్ని బలిగొంది. దీంతో శనివారానికి మరణించినవారి సంఖ్య 724కు చేరింది. గతంలో సార్స్ బారిన పడి చైనా, హాంకాగ్లో మృతిచెందిన వారి సంఖ్య కంటే ఇది ఎక్కువ కావడం భయాందోళనకు గురిచేస్తోంది. హుబెయ్ ప్రావిన్సులోనే కొత్తగా 79 మంది మృత్యువాతపడ్డారు. మరో 3,399 మంది కొత్తవారికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 34,872కు చేరింది. ఇప్పటి వరకు 15,68 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. వైరస్ నుంచి విముక్తి పొందుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్యులు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి పెరుగుతుండడంతో చైనా ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హుబెయ్ ప్రావిన్సు, రాజధాని వుహాన్ ఇంకా అష్టదిగ్బంధంలోనే ఉన్నాయి. మరోవైపు హాంకాంగ్ కూడా ఆంక్షలు విధించడం ప్రారంభించింది.
ఇన్ఫెక్షన్ సోకిన వారిలో 82శాతం మందిలో వైరస్ తీవ్రత తక్కువగానే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. కేవలం 15 శాతం మందిలో మాత్రమే విషమ పరిస్థితులు ఉన్నట్లు తెలిపింది. ఇక మూడు శాతం ప్రజల్లో వైరస్ లక్షణాలు తీవ్రంగా మారుతున్నాయని తెలిపింది. భారత్ సహా మరో 25 దేశాల్లో ఈ వైరస్ సోకిన విషయం తెలిసిందే. దీంతో చైనా ప్రయాణాలపై ఆయా దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. జపాన్ విహార నౌక డైమండ్ ప్రిన్సెస్‌లో ఉన్నవారిలో 61 మందికి వైరస్ సంక్రమించినట్లు గుర్తించిన విషయం తెలిసిందే.
2002-03లో ఇదే తరహాలో భయోత్పాతాన్ని సృష్టించిన సార్స్ వైరస్.. చైనా, హాంకాంగ్‌లో కలిసి 650 మందిని పొట్టనెబట్టుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 120 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనాతో మరణించిన వారి సంఖ్య సార్స్ కబళించిన వారి సంఖ్యను మించిపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: అలుగుతో కరోనా వైరస్ వ్యాప్తి!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.