కరోనా భారత్‌కు వ్యాపించే ప్రమాదం ఎంత?

కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉన్న తొలి 20 దేశాల్లో భారత్‌ ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ వైరస్‌ వ్యాప్తిపై అధ్యయనం చేసేందుకు జర్మనీకి చెందిన హంబోల్ట్‌ యూనివర్సిటీ........

Published : 09 Feb 2020 14:23 IST

జర్మనీకి చెందిన ఓ విశ్వవిద్యాలయ అధ్యయనం

దిల్లీ: కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉన్న తొలి 20 దేశాల్లో భారత్‌ ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ వైరస్‌ వ్యాప్తిపై అధ్యయనం చేసేందుకు జర్మనీకి చెందిన హంబోల్ట్‌ యూనివర్సిటీ, రాబర్ట్‌ కోచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఓ ప్రత్యేక ‘కంప్యూటేషనల్‌ లేదా మ్యాథమేటికల్‌’ మోడల్‌ను అభివృద్ధి చేశాయి. మొత్తం 30 దేశాలపై వారి అధ్యయనం కొనసాగింది. దీంట్లో భారత్‌ 17వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల విమానాశ్రయాల రద్దీని అధ్యయనం చేశారు. దీని ద్వారా వైరస్ తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న దేశాల జాబితాను వరుస క్రమంలో విడుదల చేశారు. భారత్‌కు వైరస్‌ వ్యాపించే ప్రమాదం 0.219 శాతం ఉందని వెల్లడించారు. 

ఇక దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 0.066శాతం, ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి 0.034శాతం, కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమానాశ్రయానికి 0.020శాతం ప్రమాదం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. తరువాతి స్థానాల్లో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కొచ్చి విమానాశ్రయాలు ఉన్నాయి. వైరస్‌ ప్రభావిత ప్రాంతాల నుంచి గమ్య స్థానాలకు ప్రయాణించే అవకాశం ఉన్న వారి సంఖ్యను బట్టి దీన్ని అంచనావేశారు. రద్దీగా ఉండే మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ వైరస్ త్వరగా సోకే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఎంత మందికి సోకుతుంది.. ఎప్పటి వరకు సోకుతుందన్న అంశాల్ని మాత్రం కచ్చితంగా తేల్చలేమని అధ్యయనంలో పాల్గొన్న ఓ శాస్త్రవేత్త తెలిపారు.

ఇప్పటికే భారత్‌లో ముగ్గురు కేరళీయులకు ఈ వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. ఈ వైరస్ బారిన పడి చైనాలో 800 పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40వేల మందికి ఈ వైరస్‌ సోకింది. ఈ నేపథ్యంలో భారత్‌ సహా పలు దేశాలు చైనా ప్రయాణాలపై కఠిన ఆంక్షలు విధించాయి. వీసా నిబంధనల్ని మరింత కఠినతరం చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని