రిజర్వేషన్ల అంశంపై వాడీవేడీ చర్చ

లోక్‌సభలో సోమవారం రిజర్వేషన్ల అంశంపై వాడీవేడి చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ప్రతిపక్షపార్టీలు తీవ్ర విమర్శలకు దిగాయి. తీవ్ర చర్చల అనంతరం సభ నుంచి వాకౌట్‌ చేశాయి. ఉద్యోగాల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లను కల్పించడం తప్పనిసరికాదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

Published : 10 Feb 2020 17:26 IST

లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేసిన ప్రతిపక్షాలు

దిల్లీ: లోక్‌సభలో సోమవారం రిజర్వేషన్ల అంశంపై వాడీవేడి చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ప్రతిపక్షపార్టీలు తీవ్ర విమర్శలకు దిగాయి. తీవ్ర చర్చల అనంతరం సభ నుంచి వాకౌట్‌ చేశాయి. ఉద్యోగాల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లను కల్పించడం తప్పనిసరికాదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్‌ వ్యవస్థను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు చేశాయి. కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరీ, టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై దాడి చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ల అంశంలో కేంద్రం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని.. ఈ విషయాన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని డీఎంకే నేత రాజా డిమాండు చేశారు. ఇలా ప్రతిపక్ష పార్టీల నాయకులు కేంద్రంపై దాడికి దిగారు. పలువురు ఎంపీలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పందిస్తూ.. సున్నితమైన విషయాన్ని కాంగ్రెస్‌ రాజకీయం చేయాలని యత్నిస్తోందని పేర్కొంటూ వారి ఆరోపణల్ని తిప్పికొట్టారు. ఈ అంశంపై సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్‌ చాంద్‌ గహ్లాత్‌ ప్రకటన విడుదల చేస్తారని.. కొద్ది సమయం వేచి ఉండాలని రాజ్‌నాథ్‌ సూచించారు. మరోవైపు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్పందిస్తూ.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా స్పీకర్‌ ఓంబిర్లాను కోరగా.. ఆ విషయాన్ని తాను పరిశీలిస్తానని స్పీకర్‌ చెప్పారు. 

ఇటీవల సుప్రీంకోర్టు  రిజర్వేషన్ల అంశంలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ నిర్ణయంపై వచ్చిన పిటిషన్‌ను విచారించిన విషయం తెలిసిందే. ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పనిసరి కాదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రిజర్వేషన్ల ద్వారా పదోన్నతులు పొందటం కూడా వ్యక్తుల ప్రాథమిక హక్కు కాదని తెలిపింది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని