జపాన్‌ నౌకలో పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా పరీక్షల కోసం నిలిపివేసిన జపాన్‌ నౌక ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’లో భారత్‌కు చెందిన ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. అయితే......

Published : 10 Feb 2020 17:10 IST

ఆందోళనలో భారతీయులు

టోక్యో: కరోనా పరీక్షల కోసం నిలిపివేసిన జపాన్‌ నౌక ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’లో భారత్‌కు చెందిన ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. అయితే, ఎంతమంది ఉన్నారన్నది మాత్రం వెల్లడించలేదు. గత కొన్ని రోజులుగా జపాన్‌లోని యొకొహామ పోర్టులో నిలిచిపోయిన నౌకలో కరోనా కేసులు పెరుగుతుండడంతో భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమను వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని, ఐక్యరాజ్యసమితిని వారు కోరుతున్నారు.

హాంకాంగ్‌లో దిగిన ప్రయాణికుడిలో కరోనా వైరస్‌ లక్షణాలు ఉండడంతో 3,711 మందితో ప్రయాణిస్తున్న నౌకను యొకొహామలో నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో అందులోని ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నౌకలో ఉన్నవారిలో మరో 60 మందికి కొత్తగా వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో నౌకలో ఈ వైరస్‌ బారిన పడిన సంఖ్య 130కి చేరింది. మరోవైపు టోక్యోలోని భారత రాయబార కార్యాలయం నౌకలో ఉన్న భారతీయుల గురించి వెల్లడించింది. ఇందులో ప్రయాణికులతో పాటు, సిబ్బంది ఉన్నారంటూ సంఖ్య గురించి వెల్లడించకుండా ఓ ట్వీట్‌ చేసింది. సుమారు 160 మంది దాకా భారతీయులు ఉండొచ్చని సమాచారం. 

మమ్మల్ని రక్షించండి..

తమను రక్షించాలని నౌకలో ఉన్న భారతీయులు కోరుతున్నారు. చెఫ్‌గా పనిచేస్తున్న వినయ్‌కుమార్‌ మరికొందరు భారతీయులతో కలిసి ఓ వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. తమకు ఇక్కడ ఎవరూ కరోనా పరీక్షలు నిర్వహించడం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని భారతీయులందరినీ వేరు చేసి ఇళ్లకు పంపించాలని కోరారు. వీలైనంత తొందరంగా తమను రక్షించాలని అభ్యర్థించారు.

దీర్ఘకాలిక రోగుల అవస్థలు

కరోనా వైరస్‌ నేపథ్యంలో నౌకలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందరూ మాస్కులు ధరించాలని, ఎవరి క్యాబిన్లలో వారే ఉండాలంటూ నౌకలో ఆంక్షలు విధించారు. దీంతో కిటికీలు కూడా లేని కేబిన్లలో ఉంటున్న దీర్ఘకాలిక రోగులు మందుల కోసం ఇబ్బంది పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని