దిల్లీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బరిలో దిగిన 672 మంది అభ్యర్థుల భవితవ్యం మరో రెండు,మూడు గంటల్లో తేలిపోనుంది............

Updated : 11 Feb 2020 12:28 IST

దిల్లీ: దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. బరిలో దిగిన 672 మంది అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 21 కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. లెక్కింపు ప్రక్రియను పరిశీలించడానికి 33 మంది పర్యవేక్షకులను ఎన్నికల సంఘం నియమించింది.  

70 స్థానాలున్న దిల్లీ అసెంబ్లీకి ఈ నెల 8న పోలింగ్‌ జరిగింది. ఓటింగ్‌ శాతం నిర్ధారణలో తీవ్ర జాప్యం, ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి పెరిగింది. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి భారీ విజయం తథ్యమని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లో ఆప్‌, భాజపా మధ్య ప్రధాన పోరు సాగింది. 22 ఏళ్ల తర్వాత దిల్లీలో పాగా వేసేందుకు భాజపా సర్వశక్తులూ ఒడ్డింది. పోలింగ్‌ ముగిసిన 24 గంటల తర్వాత ఓటింగ్‌ శాతాన్ని 62.59గా ఎన్నికల సంఘం ప్రకటించింది.

మరోవైపు ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు. మంగళవారం ఉదయం దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్‌ తివారి మాట్లాడుతూ.. ‘‘నాలో ఏమాత్రం కంగారు లేదు. భాజపాకు ఈరోజు మంచి ఫలితాలే వస్తాయన్న విశ్వాసం నాకుంది. ఈరోజు మేం దిల్లీలో అధికారంలోకి రాబోతున్నాం. మేం 55 సీట్లు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు విజయంపై ధీమాగా ఉన్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గెలుపు సంబరాల్లో భాగంగా కార్యకర్తలెవరూ బాణసంచా పేల్చొద్దని పిలుపునిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని