చీప్‌ పాలిటిక్స్‌ను చీపురుతో చిమ్మి..!

దిల్లీ ఎన్నికల్లో మరోసారి చరిత్ర పునరావృతమైంది. ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్‌) మరోసారి విజయకేతనం ఎగరేసింది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మేజిక్‌ పనిచేసింది. మరోసారి ఆప్‌ మెజారిటీ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైపోతోంది. సామాన్యూడి ముఖ్యమంత్రిగా ముద్రపడిన అరవిందుడినే  ప్రజలు ఆదరించారు.

Updated : 11 Feb 2020 15:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

దిల్లీ ఎన్నికల్లో మరోసారి చరిత్ర పునరావృతమైంది. ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్‌) మరోసారి విజయకేతనం ఎగరేసింది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మేజిక్‌ పనిచేసింది. మరోసారి ఆప్‌ మెజారిటీ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైపోతోంది. సామాన్యుడి ముఖ్యమంత్రిగా ముద్రపడిన అరవిందుడినే  ప్రజలు ఆదరించారు. ప్రచారం సందర్భంగా ప్రత్యర్థుల ఉచ్చులోకి జారకుండా తెలివిగా వ్యవహరించడం.. పథకాల రూపకల్పన.. అమలులో అవినీతి మరకలు అంటించుకోకపోవడం.. జాతీయత విషయంలో రాజీలేదనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపడం.. దిల్లీ స్థానిక సమస్యలకే ఎక్కువ ప్రధాన్యం ఇవ్వడం వంటి కారణాలతో ఆయన విజయం నల్లేరుపై బండి నడకలా సాగింది. ఆయనతో పాటు పార్టీ ప్రధాన నాయకులు కూడా విజయం సాధించారు.      

పథకాలు.. పారదర్శకత

దిల్లీలోని కీలక అంశాలన్నీ కేంద్రం పరిధిలో ఉండటంతో.. తమ వద్ద ఉన్న పరిమితమైన శాఖలతోనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రజలను మెప్పించారు. దీనికి తోడు దిల్లీలో అత్యధిక మంది విద్యావంతులు ఉండటంతో వారికి కేంద్రం పెత్తనంపై స్పష్టమైన అవగాహన ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన కేజ్రీవాల్‌ పనికిరాని విమర్శలతో ప్రచారంలోకి వెళ్లకుండా.. ఐదేళ్లలో తానేంచేశారో ప్రజలకు వివరించారు. ఆప్‌ హయాంలో ఏర్పాటు చేసిన 400 మొహల్లా క్లినిక్‌లు పేద, నిరక్షరాస్య వర్గాలను కేజ్రీవాల్‌ను బాగా దగ్గర చేశాయి. దీనికి తోడు మహిళలకు బస్సుల్లో పింక్‌ పాస్‌ల సాయంతో ఉచిత ప్రయాణాలు కల్పించడంతోపాటు బస్సుల్లో మార్షల్స్‌ను ఏర్పాటు చేయడం విశేషంగా ఆకట్టుకొంది. ఈ ఒక్క పథకంతోనే ఉద్యోగాలు చేసే  మహిళలకు ఒక్కొక్కరికి ప్రతినెలా దాదాపు రూ.1,800 వరకు లబ్ధి చేకూరింది. నీటిబిల్లులు సగానికి తగ్గించడం.. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు వంటి పథకాల లబ్ధిదారులు ఆయనకు బలమైన ఓట్‌ బ్యాంక్‌గా మారిపోయారు. పరిమిత వనరులతో ఫలితాలు సాధించిన సీఎంగా అరవిందుడు ఓటర్ల మనసు దోచుకొన్నాడు. దీంతోపాటు అవినీతి మరకలు అంటుకోకుండా ఆయన తన పాలనలో జాగ్రత్త పడ్డారు. ఇవి ఎన్నికల సమయంలో అక్కరకొచ్చాయి. 

విద్యారంగం..

విద్యారంగంలో దిల్లీ సాధించిన విజయం దేశానికే తల మానికంగా నిలుస్తోంది. బడ్జెట్‌లో కేజ్రీవాల్ ప్రభుత్వం దాదాపు 20శాతానికి పైగా నిధులను విద్యారంగానికే కేటాయిస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌లో విద్యనభ్యసించిన ఆతిషి మారలెనాను విద్యా రంగ సలహాదారుగా నియమించారు. హ్యాపీనెస్‌ అంశాల బోధన, 8,000 తరగతి గదుల నిర్మాణం, తల్లిదండ్రుల కమిటీల నిర్వహణ వంటి నిర్ణయాలతో విద్యావిధానంలో భారీగా మార్పులు చోటుచేసుకొన్నాయి. 2018లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత 91శాతం ఉండగా.. ప్రైవేటు పాఠశాలల్లో 83శాతం మాత్రమేఉండటం గమనార్హం. ఈ విజయం దిల్లీ ప్రజల మనసులపై బలమైన ముద్ర వేసింది.   

కాలుష్యంపై పోరాటం..

దిల్లీలో కాలుష్య సమస్యపై ఆప్‌ సర్కార్‌ వినూత్న విధానాలు అవలంభించింది. సరిబేసి విధానం పాటించి సమస్యను అదుపులోకి తెచ్చేందుకు చేతనైన ప్రయత్నం చేసింది. ఆ తర్వాత  ఈ విధానానికి న్యాయ పరమైన చిక్కులు ఎదురైయ్యాయి. ప్రజలు దీనిని కేజ్రీవాల్‌ వైఫల్యంగా చూడలేదు. సమస్య పరిష్కరించేందుకు మొండిగా చేసిన ఒక ప్రయత్నంగానే భావించడంతో ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకత ఎదురుకాలేదు. 
భాజపా చెత్త వ్యాఖ్యలు..

పరిధి దాటి వ్యాఖ్యలు చేయకుండా తమ నాయకులను నియంత్రించడంలో భాజపా వైఫల్యమే ఇప్పుడు ఆ పార్టీ ఓటిమికి ఓ కారణంగా నిలిచాయి. మరోపక్క కేజ్రీవాల్‌ ఎక్కడా నియంత్రణ కోల్పోకుండా హుందాగా వ్యవహరించారు. కేంద్ర మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌, ఎంపీ పర్వేష్‌ వర్మలు దిల్లీ ముఖ్యమంత్రిని ఏకంగా ఉగ్రవాదితో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనికి కేజ్రీవాల్‌  స్పందిస్తూ తాను ఉగ్రవాది అయితే ఎన్నికల్లో కమలం గుర్తుపక్కన బటన్‌ నొక్కాలని ప్రజలను కోరారు. మరోపక్క ఆయన కుమార్తె హర్షిత కొంత భావోద్వేగానికి గురై స్పందించారు. ‘నా తండ్రి భగవద్గీత చదివించేవారు.. అలాంటి వ్యక్తిని  ఉగ్రవాది అంటారా..?’ అని భాజపా నేతలను నేరుగా ప్రశ్నించింది. ఇది నేరుగా ప్రజల హృదయాలను తాకింది. మరోపక్క ఎన్నికల సంఘం కూడా పర్వేష్‌ శర్మకు షాక్‌ ఇచ్చింది. ఇవన్నీ భాజపాకు నష్టాన్నే చేకూర్చాయి. మరోపక్క యూపీ సీఎం ఆధిత్యనాథ్‌ కూడా షహీన్‌ బాగ్‌ ఆందోళనలకు కేజ్రీవాల్‌కు ముడిపెడుతూ వ్యాఖ్యలు చేశారు. అసలు ఆప్‌ పరిపాలనలో లోపాలను ఎత్తి చూపడంలో భాజపా విఫలమైందనే చెప్పాలి. 

ప్రత్యర్థికి ముఖ్యమంత్రి అభ్యర్థిలేకపోవడం..

భాజపాకు ముఖ్యమంత్రి అభ్యర్థి కొరవడటం కూడా ఆప్‌కు కలిసి వచ్చింది. తమ పార్టీకి కేజ్రీవాల్‌ నాయకుడని.. మరి భాజపాకు ఎవరు నాయకత్వం వహిస్తారని పదేపదే ప్రచారంలో ఆప్‌ నేతలు ప్రశ్నించారు. దీనికి భాజపా నుంచి మౌనమే సమాధానమైంది. కమలం పార్టీలోని సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ, మదన్‌ లాల్‌ ఖురానా వంటి జనాకర్షణ ఉన్న నాయకులు కన్నుమూయడంతో స్థానికంగా నాయకత్వం లేమి స్పష్టంగా కనిపించింది. కేంద్ర మంత్రి హర్షవర్థన్‌ ఉన్నా ఆయన ఒక్కడి వల్ల ప్రచారం సాధ్యంకాలేదు. ఇక కాంగ్రెస్‌లో బలమైన నేత షీలా దీక్షిత్‌ కన్నుమూయడంతో ఆప్‌ను ఎదుర్కొనే బలమైన నేతలు ఎవరూ లేకుండాపోయారు.  

ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవడం..

సాధారణంగా నిధుల కొరతతో రెండు సార్లు పాలిస్తే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. కానీ, కేజ్రీవాల్‌ విషయంలో మాత్రం దిల్లీ ప్రజలు సంతృప్తికరంగానే ఉన్నారు. ఎన్నికలకు ముందు అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రం సీఎస్‌డీఎస్‌ నిర్వహించిన సర్వేలో అత్యధిక మంది కేజ్రీవాల్‌కు జైకొట్టారు. ఇది ఆప్‌కు నైతికంగా బలం చేకూర్చింది. 
షహీన్‌బాగ్‌, భారత్‌-పాక్‌ వంటి ఉద్వేగాంశాలకు  దూరంగా ఉంటూ  కేజ్రీవాల్‌ కేంద్రంగా సాగిన ప్రచారంలో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించకుండా ‘ఆప్‌’ అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. హిందూ యాత్రికులకు ‘ఆప్‌’ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయాణ రాయితీల విషయాన్ని కొంతకాలంగా కేజ్రీవాల్‌ పలు సభల్లో పదేపదే పునరుద్ఘాటించడం కలసివచ్చింది. మరోవంక కొన్ని సభల్లో హనుమాన్‌ చాలీసాను చిన్నపాటి తప్పులేకుండా గడగడా చదివి వినిపించి హిందూ ఓటర్లను ఆకట్టుకున్నారు. ఇటీవలి వరకూ కాంగ్రెస్‌ పక్షాన నిలిచిన ముస్లిం ఓటర్లు- క్రమంగా ‘ఆప్‌’ వైపు మళ్లడం కేజ్రీవాల్‌కు కలిసివచ్చింది. మొత్తం ఓటర్లలో మైనారిటీలు 13శాతంగా ఉన్నారు. దిల్లీలోని 20 నియోజకవర్గాల్లో ముస్లిములు సగటున 20శాతానికిపైగానే ఉన్నారు. ఇంకోవంక దిల్లీలోని 18 స్థానాల్లో హిందుత్వ నినాదం దూకుడుగా విస్తరించింది. ఈ నేపథ్యంలో వారిని ఆప్‌ పార్టీ సంతృప్తి పర్చింది. 

కేంద్రం వేధింపులతో సానుభూతి..

కేంద్రం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రిగా అరవింద్‌ కేజ్రీవాల్‌పై ప్రజల్లో విపరీతమైన సానుభూతి లభించింది. ఎన్నికల ముందు దిల్లీ డిప్యూటీ సీఎం వద్ద పనిచేసే అధికారిపై సీబీఐ దాడులు నిర్వహించడం ప్రజలకు కొంత చిరాకు తెప్పించింది. దీనికి తోడు కేజ్రీవాల్‌ నామినేషన్‌ వేసేందుకు వెళితే దాదాపు రెండురోజుల పాటు భారీ జనాలు తరలివచ్చి ఆయన కంటే ముందే లైన్లో నిలబడటంతో సీఎం గంటల తరబడి ఎదురు చూసేలా చేశారు. దీనిని ఆయన ఆయన ఓపిగ్గా భరించడం కూడా ప్రజల్లో ఆయనకు మర్యాదస్తుడిగా మంచిపేరును తెచ్చింది. ఇక లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కొర్రీలు.. ఆప్‌ వివాదాలు దిల్లీ ప్రజలకు తెలిసినవే. ఇలాంటి చిల్లర వివాదాలు భాజపాకు నష్టమే చేకూర్చాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని