‘కరోనా’ పేరు మారింది!

చైనాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ.. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక పేరును పెట్టింది. కోవిడ్‌-2019(covid-2019)ను కరోనాకు అధికారిక పేరుగా నిర్ణయించినట్లు వెల్లడించింది.

Published : 12 Feb 2020 00:45 IST

కొత్త పేరు పెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: చైనాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విజృంభిస్తూ.. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధికారికంగా పేరును పెట్టింది. కరోనాకు కోవిడ్‌-2019(covid-2019)ను పేరుగా నిర్ణయించినట్లు వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రస్‌ అదానోమ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనాకు మేము కోవిడ్-19గా పేరును నిర్ణయించాం. కోవిడ్‌ పూర్తి పేరు c- corona, v- virus, d- disease2019. కరోనా అనే పేరు దానికి చెందిన కొన్ని వైరస్‌ల సమూహాన్ని సూచిస్తుంది. దీంతో ఈ పేరుపై గందరగోళాన్ని తొలగించేందుకు పరిశోధకులు ఈ అధికారిక పేరును పెట్టారు. ప్రజల్లో గందరగోళం కలిగించకుండా ఒకపేరు ఉండటం ముఖ్యం. అందుకే కొత్త పేరు నిర్ణయించాం. మేము కనుగొన్న పేరు ఒక భూభాగాన్ని గానీ, ఒక జంతువును గానీ, ఒక స్వతంత్ర జాతిని గానీ సూచించదు. ఈ పేరు ఆ వ్యాధిని తెలియజేస్తుంది’’ అని టెడ్రస్‌ వెల్లడించారు. ఈ వ్యాధి కారణంగా చైనాలో ఇప్పటివరకు సుమారు 1000 మంది మరణించినట్లు అక్కడి అధికారవర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని